21-11-2025 10:43:57 AM
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Greater Hyderabad Municipal Corporation) అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోలకు షాకిచ్చింది. ఈ రెండు సంస్థలు ట్రేడ్ లైసెన్స్ ఫీజులను తక్కువగా చెల్లిస్తున్నట్లు బిల్దియా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు ఫీజులను ఎగవేసినందుకు నోటీసులు జారీ చేసింది. అధికారుల ప్రకారం, అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studio) 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పనిచేస్తోంది కానీ 8,100 చదరపు అడుగులకు మాత్రమే పన్ను చెల్లిస్తోంది. అన్నపూర్ణ స్టూడియో రూ.11,52,000 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 49,000 మాత్రమే చెల్లించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా, రామానాయుడు స్టూడియోస్(Ramanaidu Studios) 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ కేవలం 1900 చదరపు అడుగులకే మాత్రమే ట్యాక్స్ చెల్లిస్తోందని అధికారులు తెలిపారు. రూ. 2,73,000 చెల్లించాల్సి ఉంది కానీ రూ. 7,600 మాత్రమే చెల్లించిందని అధికారులు తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ పూర్తిగా ట్రేడ్ లైసెన్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలని హెచ్చరిస్తూ మున్సిపల్ అధికారులు ఈ రెండు సంస్థలకు నోటీసులిచ్చారు.