21-11-2025 01:04:23 AM
త్వరలోనే ఏసీబీ ఛార్జిషీట్
డీవోపీటీ అనుమతులు రాగానే అర్వింద్‌కుమార్ ప్రాసిక్యూషన్ కూడా..
బీఆర్‌ఎస్ కౌంటర్ ప్లాన్
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి) : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఈ-కార్ రేసు పేరిట అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. కేసు విచారణను ఏసీబీకి అప్పగించింది. ఈ క్రమంలో ఏసీబీ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ- కేసులో కేటీఆర్‌ను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ అనుమతిలిచ్చారు. ఫార్ము లా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ఇప్పటికే నాలుగు సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ-కార్ రేసింగ్‌లో రూ.54.88 కోట్ల నిధుల దుర్వినియోగం అయ్యాయన్న కేసులో ఏసీబీ ఈ విచారణ జరుపుతోంది.
ఈ కేసులో కేటీఆర్ పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయంటూ ప్రాసిక్యూషన్‌కు అనుమ తి ఇవ్వాలంటూ గవర్నర్‌ను ఏసీబీ అనుమతి కోరింది. ఈ మేరకు ౭౦ రోజుల క్రితం ఏసీబీ లేఖ రాసింది. దానిని పరిశీలించిన గవర్నర్ తాజాగా కేటీఆర్ విచారణకు అనుమతి జారీ చేశారు. దీంతో ఈ--కార్ రేసింగ్ కేసులో ఏసీబీ త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఏ1గా కేటీఆర్..
ఈ-కార్ రేసింగ్‌కు సంబంధించిన చెల్లింపులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏసీబీ గత ఏడాది డిసెంబర్‌లో విచారణ ప్రారంభించింది. రేసింగ్‌లో అవకతవకలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో ఏ1గా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది. ఈ క్రమంలో ఇప్పటికే కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది.
ఈ కేసులో మొదట్లో కీలకంగా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ ప్రతినిధులను ఏసీబీ గత జనవరిలో విచారించింది. ఏస్ నెక్స్ట్‌జెన్ సంస్థ డైరెక్టర్ అనిల్‌ను దర్యాప్తు అధికారులు సుమారు రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో ఏస్ నెక్స్ ట్జ్రెన్ సంస్థనే రేసు నిర్వహించాల్సి ఉండగా కార్ రేస్‌కు సంబంధించి అనుమతులు పొందేందుకు సమర్పించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి వివరాలు గురించి ఏసీబీ అధికారులు ఆరా తీశారు.
డీఓపీటీ అనుమతులు రాగానే..
ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో అత్యం త కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే నాలుగుసార్లు, అరవింద్ కుమార్ ఐదుసార్లు విచారణకు హాజరయ్యారు. కేసులో కేటీఆర్ పాత్రకు సంబంధించిన వందలాది డాక్యుమెంట్లను, ఈ-మెయిల్స్‌ను, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను సేకరించినట్టు చెబుతున్న ఏసీబీ తొమ్మిడి నెలలపాటు అన్ని కోణాల్లో విచారణ కొనసాగించింది.
అయితే మాజీ మం త్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అయిన కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతూ సెప్టెంబర్ 9న గవర్నర్‌కు ఏసీబీ లేఖ రాసిం ది. ఈ క్రమంలో 10 వారాల తర్వాత కేటీఆ ర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ నుంచి అనుమతి లభించింది.
అయితే ఈ-కార్ రేసు కేసులో ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు డీవోపీటీ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో డీవోపీటీ అనుమతి కోసం ఏసీబీ ఎదురు చూస్తున్నది. అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కూడా అనుమతి వచ్చిన వెంటనే కేటీఆర్, అర్వింద్‌కు మార్, బీఎల్‌ఎన్ రెడ్డిలపై ఛార్జ్‌షీట్ దాఖలుచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
బీఆర్‌ఎస్ కౌంటర్ ప్లాన్..
రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు తెరమీదకు వస్తున్నాయి. కేటీఆర్ పై ఫార్ములా ఈ-రేసు కేసుపై చర్యలకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఎంతో ఆసక్తికరంగా మారిం ది. కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతులు రావడంతో బీఆర్‌ఎస్ నాయక త్వం అలర్ట్ అయింది. ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలో చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ సమయంలోనే కేసీఆర్ పార్టీ ముఖ్య నాయకత్వానికి కీలక దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
కేసును న్యాయపరంగా ఎదుర్కుంటూనే రాజకీయంగా ముందుకు వెళ్లటం పైన నిర్ణ యం తీసుకుంటున్నారు. దీంతోపాటు కేటీఆర్ పైన ఎలాంటి చర్యలకు అవకా శం ఉందనే అంశం పైన కూడా బీఆర్‌ఎస్ నాయకత్వం సమాలోచనలు చేస్తుం ది. ఇప్పటికే కేటీఆర్ ఈ కేసులో విచార ణ ఎదుర్కొన్నారు. అయితే కేసుకు సంబంధించి కేటీఆర్ తన వాదన స్పష్టం చేశారు. అవినీతికి ఆస్కారం లేదనే అం శం పైన వివరణ ఇచ్చారు.
ఈ నేపథ్యం లో ఈ రేసింగ్ కేసులో న్యాయ పోరాటం చేస్తూనే, రాజకీయంగా ఎదుర్కోవటానికి సిద్దం కావాలని గులాబీ దళం సిద్ధమైంది. ఇందు కోసం రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈ కేసులో కేటీఆర్‌ను టార్గెట్ చేశారనే వాదన ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్న విషయాన్ని బలంగా వినిపించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ఈ-కార్ రేసింగ్ కేసు..
ఫార్ములా ఈ--కార్ రేసింగ్‌పై 2022 అక్టోబరు 25న ఒప్పందం కుదిరింది. ఫార్ములా--ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్ట్స్ జెన్, పురపాలక శాఖలు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేస్‌లు హైదరాబాద్‌లో నిర్వహించే లా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్ రోడ్‌లో తొమ్మిదో సీజన్ రేసింగ్ నిర్వహించారు. తదుపరి ఏడాది 10 వ సీజన్ నుంచి ఏస్ నెక్ట్స్ జెన్ అకస్మాత్తుగా ఈ-కార్ రేసింగ్ నిర్వహణను తప్పుకుంది. దీంతో ప్రమోట ర్‌గా హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) బాధ్యత తీసుకోవాలని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో 2023 అక్టోబరులో రూ. 54.88 కోట్లను ఫార్ములా -ఈ ఆపరేషన్స్ సంస్థకు హెచ్‌ఎండీఏ నేరుగా బదిలీ చేసింది. ఈ వ్యవహారమే ఇప్పుడు ఈ మొత్తం వివాదానికి తెరలేపింది. హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థికశాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండానే ఈ చెల్లింపులు జరిగాయని ఏసీబీ వాదిస్తున్నది. వీటిలోనూ రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధానంగా ప్రస్తావించింది. ఈ మేరకు ఏసీబీ విచారణ జరిపింది.
కేటీఆర్‌పై కక్ష సాధింపు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ప్రశ్నించే గొంతులను సీఎం రేవంత్‌రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమ ర్శించారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌పై అక్రమ కేసులు బనా యించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికమని విమర్శించారు.
ప్రజల సొమ్ము తిన్నవారు అనుభవించాల్సిందే..
కాంగ్రెస్ ప్రభు త్వం కక్షసాధింపు చర్యలకు పోదని, అలా చేసి ఉంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు ఇప్పటికే జైల్లో ఉండేవారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ప్రజల సొమ్ము ఎవరు తిన్న శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. మోదీ, రేవంత్ చీకటి ఒప్పం దం చేసుకొని ఉంటే 6 నెలల ముందే గవర్నర్ అనుమతి వచ్చేది కదా అని పేర్కొ న్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయిందని, దీంతో దిమ్మ తిరిగి గవర్నర్ అనుమతి ఇచ్చారన్నారు. ఈ కార్ రేస్ లో చట్టం తనపని తాను చేస్తుందని, కిషన్ రెడ్డి, బండి సంజయ్ గవర్నర్ అనుమతి ఎందుకు ఆలస్యం అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.