12 April, 2026 | 2:06 AM

చెరువులో మునిగి బాలికల మృతి

12-04-2026 12:07 AM

మహబూబాబాద్ జిల్లా మట్టెవాడలో విషాదం

మహబూబాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): ఈతకు వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీట మునిగి దుర్మరణం పాలైన ఘటన మహబూ బాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టెవాడ శివారు నెలవంచలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాలుగో తరగతి చదువుతున్న 9 ఏళ్ల కత్తుల శ్రీజ, పెనుక చైత్రలు ఒక్క పూట బడికి వెళ్లి, అక్కడి నుంచి ఊర చెరువు వద్దకు వెళ్లారు.

సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి బాలికల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో చెరువు బావిలో వెతకగా ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలు ముకున్నాయి. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో విద్యార్థితో కలిసి వీరిద్దరూ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లారని, అందులో ప్రణీత అనే బాలిక ఇంటికి తిరిగి రాగా, వీరిద్దరూ చెరువులో దిగిన సమయంలో అంటిన బురదను కడుక్కోవడానికి చెరువులోనే ఉన్న బావిలోకి దిగి ప్రమాదవశాత్తు అందులో పడిపోవడం వల్ల మరణించి ఉంటారని భావిస్తున్నారు.