calender_icon.png 1 May, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికలదే పైచేయి

01-05-2025 02:20:31 AM

  1. 596 మార్కులతో స్టేట్ టాపర్లుగా నిమ్మ అన్షిత, ఎస్ కృతి
  2. 595 మార్కులు సాధించిన సముద్రాల అద్వైత
  3. పదోతరగతి ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత
  4. గతంలో కంటే ఈసారి 1.47 శాతం ఎక్కువ మంది పాస్
  5. ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా టాప్, చివరిస్థానంలో వికారాబాద్
  6. అత్యధికంగా తెలంగాణ రెసిడెన్షియల్ బడుల్లో ఉత్తీర్ణత
  7. జీపీఏ విధానం ఎత్తివేత.. మార్కుల ప్రకటన
  8. జూన్ 3 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
  9. పదోతరగతి ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పదో తరగతి ఫలితాలు వెలువ డ్డాయి. మొత్తం 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 91.31శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 92.78శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలురు 91.32 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 94.26శాతం మంది పాసయ్యారు.

బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో పదోతరగతి ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క,  రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావుతో కలి సి విడుదల చేశారు.

మార్చి 21 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 5,07,107 మంది విద్యార్థులు హాజరుకాగా, వీరిలో 4,96,374 మంది రెగ్యులర్, 10,733 మంది విద్యార్థులు ప్రైవేట్‌గా హాజరయ్యా రు. 4,96,374మందిలో 4,60,519 (92. 78శాతం) మంది పాసయ్యారు. వీరిలోనూ 2,50,345 మంది బాలురకు 2,28,608 మంది పాసైతే, బాలికలు 2,46,029 మంది కి 2,31,911 మంది పాసయ్యారు.

ప్రైవేట్ విద్యార్థులు 6,141 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి గ్రేడింగ్ ప్రకటించలేదు. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్, మొత్తం మార్కులతోపాటు సబ్జెక్ట్ వారీగా గ్రేడ్‌ను టెన్త్ మెమోల్లో ఇచ్చా రు. పాస్ ఫెయిల్ ఇచ్చారు. జీపీఏ విధానా న్ని ఎత్తేశారు.

ఫస్ట్ ప్లేస్‌లో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లు

పదో తరగతి ఫలితాల్లో గురుకులాల విద్యార్థులు సత్తాచాటారు. అత్యధికంగా తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో 98.79 శాతం మంది పాసయ్యారు. ఆతర్వాత బీసీ వెల్ఫేర్‌లో 97.79 శాతం, సోషల్ వెల్ఫేర్‌లో 97.71 శాతం, ట్రైబల్ వెల్ఫేర్-97.63 శాతం, మైనార్టీ-96.57 శాతం, మోడల్-95.31శాతం, ఆశ్రం బడులు-95 శాతం, కేజీబీవీ-94.42 శాతం, ప్రైవేట్-94.21 శాతం, ఎయిడెడ్-90.65 శాతం, జడ్పీ స్కూల్స్-89.13 శాతం, ప్రభుత్వ స్కూళ్లలో 84.83శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

మేనేజ్‌మెంట్ల వారీగా చూసుకుంటే అత్యధికంగా తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం నమోదు కాగా, అత్యల్పంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు పాసయ్యారు. 

4,629 బడుల్లో 100 శాతం ఉత్తీర్ణత

రాష్ట్రంలో మొత్తం పదో తరగతి పాఠశాలలు 11,554 ఉన్నాయి. వీటిలో 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 5,063 ప్రైవేట్ పాఠశాలలుండగా, వీటిలో 2007 స్కూళ్లు వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తే..రెండు స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు. ఎయిడెడ్ స్కూళ్లు 148లో 28 స్కూళ్లు వందశాతం, ఆశ్రం స్కూళ్లు 227 ఉంటే అందులో 126 స్కూళ్లు వంద శాతం, బీసీ వెల్ఫేర్ 261లో 143 వందశాతం, ప్రభుత్వ బడులు 497లో 73 వంద శాతం, కేజీబీవీలు 475లో 230, మోడల్ 194లో 79, తెలంగాణ గురుకులాలు 35లో 24, మైనార్టీ గురుకులాలు 204లో 91, సోషల్ వెల్ఫేర్ 231లో 108, ట్రైబల్ 103లో 45, జడ్పీ బడులు 4,116లో 1,675 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 

గణితంలో ఎక్కువ మంది ఫెయిల్

పదో తరగతి ఫలితాల్లో ఈసారి కూడా గణితం, సామాన్యశాస్త్రంలో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. గణితం పరీక్షకు 4,96,251 మంది హాజరవగా అందులో 4,77,276 (96.18 శాతం) మంది పాసయ్యారు. సామాన్యశాస్త్రం పరీక్షను 4,96,278 మంది రాయగా, 4,80,730 (96.87 శాతం) మంది పాసయ్యారు. 99.93 శాతంతో అత్యధికంగా ద్వితీయ భాషలో, 99.43 శాతంతో సాంఘిక శాస్త్రంలో, 99.19 శాతంతో తృతీయ భాషలో, 98.62 శాతంతో ప్రథమ భాషలో విద్యార్థులు పాసయ్యారు.

జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. ఫెయిలైన విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో మే 16వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఫలితాలు విడుదల చేసిన రోజు నుంచి 15 రోజుల పాటు అవకాశం కల్పించారు. అంటే మే 15 వరకు గడువుంది. రీ కౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.

టాప్ మార్కులు 596

పదో తరగతిలో టాప్ మార్కులు 596గా నమోదయ్యాయి. 600 మార్కులకుగానూ 596 మార్కులు సాధించిన కామారెడ్డి జిల్లాకు చెందిన నిమ్మ అన్షిత స్టేట్ టాపర్‌గా నిలిచింది. ఆమెతో పాటు నిజాబాబాద్ కు చెందిన ఎస్.కృతి కూడా ౫౯౬ మార్కులు సాధించింది. హైదరాబాద్‌కు చెందిన సముద్రాల అద్వైతకు 600 మార్కులకు 595 మార్కులు సాధించి మూడో స్థానంలో నిలిచింది. వీరితోపాటు మరికొంత మందికి కూడా 590కిపైగా మార్కులు వచ్చినట్లు తెలిసింది.

మొదటిస్థానంలో మహబూబాబాద్.. 

టెన్త్ ఫలితాల్లో 99.29శాతం ఉత్తీర్ణతతో మహబూబాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 73.97శాతంతో వికారాబాద్ జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది. సంగారెడ్డి-99.09 శాతంతో రెండో స్థానం, 98.81శాతంతో జనగామ మూడో స్థానం, 98.20 శాతంతో జగిత్యాల నాల్గో స్థానం, 98.15 శాతంతో రాజన్న సిరిసిల్ల ఐదో స్థానంలో నిలిచాయి. ఆతర్వాత ఆరో స్థానంలో కరీంనగర్, ఏడో స్థానంలో యాదాద్రిభువనగిరి, ఎనిమిదో స్థానంలో ములుగు, తొమ్మిదో స్థానంలో ఆదిలాబాద్, పదో స్థానంలో పెద్దపల్లి జిల్లాలున్నాయి. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు జిల్లాలైన నారాయణ్‌పేట 19వ స్థానం, వికారాబాద్ 33వ స్థానంలో నిలిచాయి.

ఫలితాల కోసం ఎదురుచూపు

విద్యార్థులు ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూశారు. రవీంద్ర భారతిలో మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం రేవంత్ రెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేస్తారని తొలుత విద్యాశాఖ ప్రకటించింది. అయితే సీఎం విజయవాడ పర్యటన నేపథ్యంలో  మధ్యా హ్నం 2.15 గంటలకు మార్చారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారా? అని ఆతృతగా ఎదురుచూశారు. మరోవైపు రవీంద్రభారతిలో ఓకార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికపైనే టెన్త్ ఫలితాలను విడుదల చేయడంపై అక్కడికి వచ్చినవారు అసంతృప్తి వ్యక్తం చేశారు.