01-05-2025 02:08:07 AM
హైదరాబాద్, ఏప్రిల్ 30: ‘గ్రూప్-1మెయిన్స్ పరీక్షలను ఎంతమంది తెలుగులో రాశారు.. ఎంత మంది ఎంపికయ్యారు.. వారి వివరాలు ఇవ్వండి’ అని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 పరీక్షల వ్యవహారంపై బుధవారం హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ జరిపింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదన లు వినిపిస్తూ..వరుస హాల్‌టికెట్ల నంబర్లు ఉన్నవారికి ఒకే మార్కులు వచ్చాయని, నిర్దేశిత సమయానికి ప్రొవిజనల్ మార్కు ల జాబితా ఇవ్వలేదని కోర్టుకు విన్నవించారు. 20 రోజుల తర్వాత తుది మార్కు లు వెల్లడించారని, ఈ సమయంలో అవకతవకలు జరిగాయనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.
పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం.. మూల్యాంకన ప్రక్రియ గురించి టీజీపీఎస్సీని వివరాలు అడిగి తెలుసుకుంది. తెలుగులో రాసిన అభ్యర్థులకు ఎలా మార్కులు వేశారని ప్రశ్నించింది. తెలుగులో రాస్తే తక్కువ మార్కులేశారన్న ఆందోళన ఉందని, జవాబులకు సంబంధించి ఏదైనా కీ పేపర్ ఉంటుందా? అని ప్రశ్నించింది.
తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియాలకు సంబంధించి కీ ఇచ్చారా? అని అడిగింది. దీనికి కమిషన్ స్పందిస్తూ.. ఎవాల్యుయేటర్లకు ఎలాంటి కీ ఇవ్వలేదని, రాతపూర్వక పరీక్ష కావడంతో కీ ఇవ్వడం కుదరదని, జవాబు పత్రాలు దిద్దినవారు ఆయా సబ్జెక్టుల్లో నిపుణులని వివరణ ఇచ్చింది.
దీనికి కోర్టు..తెలుగులో ఎంతమంది రాశారో, ఎంతమంది ఎంపికయ్యారో వారి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు గ్రూప్-1 నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని, ఆలస్యం లేకుండా విచారణ ము గించాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను గురు వారానికి వాయిదా వేసింది.
సింగిల్ బెంచ్ ఉత్తర్వులు రద్దు చేయలేం..
అంతకుముందు గ్రూప్-1 నియామకాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వు లను రద్దుచేయాలని టీజీపీఎస్సీ వేసిన పిటిషన్‌పై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేసేందుకు నిరాకరించింది. పరీక్షా కేంద్రాల కేటాయింపు, రీకౌంటింగ్‌లో మార్కులు, టీజీపీఎస్సీ జారీ చేసిన మెమో మార్కులకు తేడాలున్నాయని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..
ఈనెల 17న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ అంశంపై విచారణ చేపట్టి గ్రూప్-1 నియామక పత్రాలను ఇవ్వొద్దని టీజీపీఎస్సీని ఆదేశించింది. సర్టిఫికె ట్ వెరిఫికే షన్ చేసుకోవచ్చని సూచించింది.
అయి తే సింగిల్ బెంచ్ ఉత్తర్వులు రద్దు చేయాలంటూ టీజీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేయగా..బుధవారం సీజే ధర్మాసనం విచారణ చేపట్టి.. కేసు ప్రస్తుతం విచారణలో ఉన్నందున జోక్యం చేసుకునేం దుకు నిరాకరించింది. టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ ముగించింది.