calender_icon.png 1 May, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్రెగుట్టలపై జాతీయ పతాకం

01-05-2025 01:52:08 AM

  1. ఎగురవెసిన భద్రతాబలగాలు
  2. గుట్టల్లోని కొంత భాగాన్ని ఆధీనంలో తెచ్చుకున్న సైన్యం
  3. 10 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్ 
  4. శాంతి చర్చలకు పిలవాలని మరోసారి విజ్ఞప్తి చేసిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్

చర్ల, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా ఉసురు పీఎస్ పరిధిలోని దుర్భేద్యమైన కర్రెగుట్టల్లో కీలక మావోయిస్ట్ నేతలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ గురువారం 10వ రోజుకు చేరింది. ఈ ఆపరేష న్‌లో అత్యంత అవరోధాలు నడుమ కర్రెగుట్టలోని కొంత భాగాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

బుధవారం శిఖరం వరకు చేరుకున్న బలగాలు దోబేకొండలపై జాతీయ పతాకాన్ని ఎగురవేశాయి. అంతకముందు నీలం సారాయి కొం డను సైతం భద్రత బలగాలు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. వేల సంఖ్యలో భద్రత బలగాలు అటవీ ప్రాం తాన్ని వ్యూహాత్మకంగా చుట్టుముట్టడంతో కర్రెగుట్ట ఆపరేషన్ మరో కీలకమైన దశకు చేరుకుంది.

ప్రస్తుతం ప్రధానమైన మూడో కొండ వైపు భద్రత బలగాలు అడుగులు వేస్తూ, ముందుకు సాగుతున్నాయి. మూడో కొండపైన కూడా జాతీయ జెండా ఎగరేస్తామని బలగాలు వెల్లడించాయి. ఒకపక్క కర్రెగుట్ట ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ శాంతి చర్చలు జరపాలని మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఈ క్రమం లో ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్‌శర్మ శాం తి చర్చల ప్రతిపాదనను తిరస్కరిస్తూ కీలక ప్రకటన చేశారు. దీంతో కర్రెగుట్టలో ఆపరేషన్ మరికొన్ని రోజులు కొనసాగే అవకా శాలు కనిపిస్తున్నాయి.

కొండపై నుంచి కాల్పులు సులభం 

భారీగా మోహరించిన భద్రతా దళాలకు కర్రెగుట్టపై మావోయిస్టుల జాడ అంతుచిక్కని విధంగా ఉంది. డ్రోన్ కెమెరాలు, హెలికాప్టర్లతో జల్లడ పట్టినా ఫలితం లేదు. ఈ కొండలపై మావోయిస్టు అగ్ర నాయకులు కర్రెగుట్టలపై ఉండి, శాంతి చర్చల ప్రస్తావన లేకపోతే భారీ ఎన్‌కౌంటర్ కొనసాగి ఉండేదనీ ప్రజాసంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.

గుట్టలపై నుంచి మావోయిస్టులు కాల్పులు జరిపినట్టయితే అధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది, కాగా మావోయిస్టులు శాంతి చర్చల పేరిట పోలీసుల కన్నుగప్పి తప్పించుకొని ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శాంతి చర్చలకు మేము సానుకూలం: ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి

ఛత్తీస్‌గఢ్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మావోయిస్టులతో శాంతి చర్చలకు సుముఖత వ్యక్తం చేశామని, వారికి పునరావాసం కల్పిస్తామన చెప్పినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి పేర్కొన్నారు. బుధవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శాంతి చర్చలు జరపాలంటూ ఇప్పడు అంటున్నారని, ఈ పని మేం ఎప్పుడో చేశామని చెప్పారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సైతం పబ్లిక్ మీటింగ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించడం సరికాదన్నారు.