2 July, 2026 | 1:16 AM

గీతం ‘గ్రాడ్యుయేషన్ డే’ కు సంసిద్ధం

02-07-2026 12:00 AM

ఆగస్టు 1న నిర్వహణ

పటాన్‌చెరు, జూలై 1 : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు తన విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఒక కీలక ఘట్టాన్ని సూచించే 17వ పట్టభద్రుల ప్రదానోత్సవం (గ్రాడ్యుయేషన్ డే)ను ఆగస్టు 1, 2026న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని గీతం రిజిస్ట్రార్ డాక్టర్ డి. గుణశేఖరన్ బుధవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

2025-26 విద్యా సంత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ), పీహెచ్.డీ. కోర్సులను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులు ఈ పట్టభద్రలు ప్రదానోత్సవంలో పాల్గొనడానికి అర్హులని తెలియ జేశారు. ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, సైన్స్, ఫార్మసీ, హ్యుమానిటీస్, ఆర్కిటెక్చర్ వంటి వివిధ విభాగాలకు చెందిన పట్టభద్రులు తమ విద్యాపరమైన విజయాలను వేడుకగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమం వేదిక కానుందన్నారు.

అర్హులైన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 2026, జూలై 3 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేర్ల నమోదు (రిజిస్ట్రేషన్), స్నాతకోత్సవానికి సంబంధించిన సమగ్ర వివరాలు, మార్గదర్శకాల కోసం విద్యార్థులు గీతం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలన్నారు. తమ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలలో తదుపరి దశను ప్రారంభించబోతున్న విద్యార్థులకు, యూనివర్సిటీ నాయకత్వం, అధ్యాపకులు, తల్లిదండ్రులు, ప్రముఖ అతిథుల సమక్షంలో తమ విద్యాపరమైన విజయాలను గుర్తుచేసుకునే అవకాశాన్ని ఈ పట్టభద్రుల ప్రదానోత్సవం కల్పిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.