సీఎం వ్యాఖ్యలపై వివరాలు చెప్పండి
బీజేపీ పిటిషన్‌పై పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. పూర్తి వివరాలు తెలుసుకోవాలని నివేదించాలని పోలీసులను ఆదేశించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా రేవంత్‌రెడ్డి బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని, రాజ్యాంగం రద్దు చేస్తారంటూ తప్పుడు వ్యాఖ్యలు చేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఈ నెల 10న స్పెషల్ జేఎఫ్‌సీఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని రెండుసార్లు వాయిదా వేసిన జడ్జి 22న విచారణ చేపట్టారు.
వివరాలు సమర్పించేందుకు సమయాన్ని కోరగా విచారణను జూలైకు వాయిదా వేశారు. కేసు మెరిట్స్‌లోకి వెళ్లకుండా వాయిదా వేయడం చట్టవిరుద్ధ మని పేర్కొంటూ వెంకటేశ్వర్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ పిటిషన్‌ను వెంటనే అనుమతించేలా మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయేస్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తర ఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. క్రిమినల్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకుండా మేజిస్ట్రేట్ కోర్టు సుదీర్ఘ వాయి దా వేయడం చట్టవిరుద్ధమని చెప్పారు.
మేజిస్ట్రేట్ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించాలని చట్టం చెబుతోందన్నారు. ఒక రోజు కంటే ఎక్కువ వాయిదా వేస్తే దానికి తగిన కారణాలను నమోదు చేయాలని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి అభ్యంతరకరమైన ప్రసంగాలు ఇప్పుడు ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తరఫున పీపీ నాగేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్లో అత్యవసరంగా వెకేషన్ బెంచ్.. అదీ లంచ్‌మోషన్ రూపంలో వాదనలు వినాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అర్ధరాత్రి వరకు వాదనలను విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేశారు.






