11 April, 2026 | 2:39 AM

మస్తాన్ సాయిని కస్టడీకి ఇవ్వండి

07-02-2025 02:13 AM

* కోర్టులో నార్సింగి పోలీసుల పిటిషన్ 

*  వెలుగులోకి కొత్త విషయాలు

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 6: సినీ నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఫిర్యాదుతో ఈ నెల 3న నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల విచారణలో రోజుకో విస్తూగొలిపే అంశాలు వెలుగుచూడటంతో వారే ఆశ్చర్యానికి గురవుతున్నారు.

డ్రగ్స్, గంజాయి ఎర వేసి చాలామంది యువతులు, వివాహితుల రహస్య వీడియోలు తీసి వాటిని వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తానని మస్తాన్ సాయి బెదిరించి వారిని లోబర్చుకున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇలా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అతడిని వారంరోజుల కస్టడీకి ఇస్తే విచారణలో మరిన్ని అంశాలు వెలుగుచూసే అవకాశం ఉందని నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.

కోర్టు దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే మస్తాన్ సాయి వద్ద లభించిన హార్డ్ డిస్క్‌లో చాలామంది యువతులు, వివాహితులతో పాటు పలువురు ప్రముఖుల రహస్య వీడియోలు లభించినట్టు తెలిసింది. 4 టీబీ సామర్థ్యం ఉన్న హార్డ్ డిస్క్‌లో వందల సంఖ్యలో వీడియోలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ హార్డ్ డిస్క్‌ను లావణ్య నార్సింగి పోలీసులకు అందజేశారు.

తనపై మస్తాన్ సాయి హత్యాయత్నం చేశాడని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొనడంతో మరో కేసును నమోదు చేశారు. మస్తాన్ సాయిపై డ్రగ్స్ కేసులు కూడా నమోదయ్యాయి. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు యత్నించారని కూడా లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

మస్తాన్ సాయి చాలా మంది యువతులతోపాటు వివాహితలకు డ్రగ్స్, గంజాయి ఇచ్చి వారి వ్యక్తిగత వీడియోలు సేకరించి భద్రపరిచినట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా మస్తాన్‌సాయితో పాటు అతడి మిత్రుడికి పోలీసులు డ్రగ్స్ పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారిపై ఎన్‌డీపీఎస్ యాక్టు కింద కూడా కేసు నమోదు చేశారు. 

* గతంలో జానీ మాస్టర్‌పైనా..

ఆర్జే శేఖర్‌బాషాపై అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమె గతంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కూడా ఫిర్యాదు చేయడంతో ఆయన జైలుపాలయ్యారు. తన అనుమతి లేకుండా శేఖర్‌బాషా తన ఫోన్ కాల్ రికార్డు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.