5 May, 2026 | 3:19 AM

జీవో 7 ను రద్దు చేయాలి

05-05-2026 01:57 AM
  1. ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలి
  2. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్న ప్రభుత్వం
  3. బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు
  4. బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడి 

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి) : రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 7ను తీసుకొచ్చిందని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 7 ను రద్దు చేయాలనే డిమాండ్‌తో సోమవారం సచివాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగ బాలు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పేద విద్యార్థుల ప్రాణాధార పథకాన్ని క్రమంగా రద్దు చేయాలనే కుట్రలో భాగంగానే ఈ జీఓని తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ నిర్ణయం ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఉన్నత విద్యపై ఘోరమైన దాడిగా అభివర్ణించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన ఘాటు లేఖను గుర్తుచేస్తూ, విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు ఆడుకోవద్దని హెచ్చ రించారు. విద్యాశాఖను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం దానిని బలహీనపరిచే విధానాలను అవలంబించడం అత్యం త దురదృష్టకరమన్నారు. గతంలో విజయవంతంగా అమలైన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నిలిపివేస్తూ, విద్యార్థుల ఆశలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. గురుకుల విద్యా వ్యవస్థను బలహీనపరిచిన తర్వాత, ఇప్పుడు ఉన్నత విద్యపై కూడా కత్తి పెట్టడం వల్ల పేద విద్యార్థులు చదువును మధ్యలోనే వదిలే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీఓ-7ను వెంటనే రద్దు చేసి విద్యార్థులకు ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థి లోకం ఒక్కసారి ఉద్యమిస్తే పరిస్థితులు ఎలా మారుతాయో ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.