calender_icon.png 7 December, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోవా అగ్నిప్రమాదం స్థలాన్ని పరిశీలించిన సీఎం

07-12-2025 09:07:40 AM

గోవా: ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలోని ఓ ప్రముఖ నైట్ క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.  బిర్చ్‌ నైట్‌ క్లబ్‌లో సిలిండర్‌ పేలి 25 మంది మరణించారు. గోవా అగ్నిప్రమాద స్థలాన్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరిశీలించి, ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని అభివర్ణిస్తూ విచారణకు ఆదేశించారు. ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవదహనం కాగా, మిగతావారు ఊపిరాడక మృతి చెందినట్లు గోవా సీఎం పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు నైట్ క్లబ్ మహిళ సిబ్బందితో పాటు నలుగురు పర్యాటకులు ఉన్నారు.

ఈ నైట్‌క్లబ్ గోవా రాజధాని పనాజీ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉందని, దీనిని గతేడాది ప్రారంభించారు. నైట్ క్లబ్‌లో భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించ‌లేద‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలిన‌ట్లు సీఎం వెల్లడించారు. త్వ‌ర‌లోనే పూర్తి స్థాయి విచార‌ణ జ‌రిపి నిందితుల‌పై క‌ఠిన చర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. నైట్ క్ల‌బ్‌కు అనుమ‌తి ఇచ్చిన అధికారుల‌పై కూడా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి తన హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ (Bharatiya Janata Party) ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఘటనా స్థలాన్ని సందర్శించి, ఈ సంఘటన కలవరపరిచేదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడానికి గోవాలోని అన్ని ఇతర నైట్‌క్లబ్‌లపై వివరణాత్మక భద్రతా ఆడిట్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ దుర‌దృష్టక‌ర‌మైన ఘ‌ట‌నలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.