29-08-2025 08:56:55 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని గోదావరి నది మహోగ్రవరూపంగా ప్రవహిస్తున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లా గేట్ల ను ఎత్తి గోదావరిలో నీటిని విడుదల చేయడంతో గోదావరి మహోగ్రత రూపంగా ప్రవహిస్తున్నది. కాళేశ్వరంలోని సరస్వతి ఘాటు వద్ద జ్ఞాన దీపాలు మునిగి సరస్వతి మాత విగ్రహం వరకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
మేడిగడ్డ( లక్ష్మి) బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ నుండి రాగా మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీటి ప్రవాహాన్ని అంచనా వేయుటకు సి.డబ్ల్యూ.పి.ఆర్.ఎస్ పుణె బృందం ఎలక్ట్రిక్ బోట్ల తో గోదావరిలో తిరుగుతూ నీటి ప్రవాహ వేగాన్ని తెలుసుకుంటున్నారు. ఈ గోదావరి ప్రవాహాన్ని అకోస్టిక్ డోప్లర్ కరెంట్ ప్రొఫైలర్ ఎ.డి.సి.పి సర్వే ద్వారా తెలుసుకున్నట్లు పుణే శాస్త్రజ్ఞులు తెలిపారు.