29-08-2025 11:21:34 PM
మీరు చేసిన త్యాగంతోనే ప్రాజెక్టు కల సకారం
రిజర్వాయర్ తో 8 లక్షల ఎకరాల నీరందుతుంది
డబ్బులతో భూములకు వెలకట్టలేం ఎమ్మెల్యే
4 తండాలలోని 237 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
ఉదండాపూర్ – వల్లూరు పరిధి తండాలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల: ప్రజలకు మంచి జరుగుతుందంటే ఎల్లప్పుడూ పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నానని జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గంలోని ఉదండాపూర్ – వల్లూరు గ్రామాల పరిధిలోని పలు తండాలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వల్లూరు గ్రామ పరిధిలోని తుమ్మలకుంట తండా, రేగడి పెట్టి తండా, చిన్నగుట్ట తాండా , ఊదండపూర్ పరిధిలోని ఒంటి గుడిసె తండాలకు సంబంధించిన ఇళ్ల స్థలాల పట్టాలను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి భూ నిర్వాసితులకు అందజేశారు.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ... ఉదండాపూర్ – వల్లూరు పరిధిలోని పలు తండాల వారికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. మన సొంత ఊరు, మన పుట్టినిల్లు, మన మట్టిని వదిలి వెళ్లడం ఎంత బాధగా ఉంటుందో నేను బాగా అర్థం చేసుకోగలని ఆవేదన వ్యక్తం చేశారు.కానీ, మీరు చూపిన పెద్ద మనసు, చేసిన త్యాగం వల్లే ఈరోజు ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు విజయవంతంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈరోజు ఉదండాపూర్- వల్లూరు గ్రామాల పరిధిలోని 4 తండాలలోని 237 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ రిజర్వాయర్ పూర్తయి నీళ్లు వదులుతే 8 లక్షల ఎకరాల రైతులకు పంటలలో బంగారు విత్తనాలు నాటే అవకాశం కలుగుతుందని,ఆ మహత్తర క్షణానికి నిజమైన మూలం మీరు చేసిన త్యాగమేనని,అందుకే మీ అందరిని నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే చెప్పారు.
డబ్బులతో భూములకు వెలకట్టలేం: ఎమ్మెల్యే
మీరు ఇచ్చిన భూముల విలువను డబ్బుతో కొలవలేము, కానీ ఆ త్యాగానికి సరైన గౌరవం లభించేలా నేను నిరంతరం కృషి చేస్తాననీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన ఒక్కరికి కూడా అన్యాయం జరగనీయను, చివరి వరకు మీతో నిలబడి, మీ హక్కులు, మీ న్యాయం సాధించే వరకు పోరాడుతానని భరోసా కల్పించారు.ఇప్పటికే ఉదండాపూర్‌కు సంబంధించిన అవార్డును త్వరగా పాస్ చేయాలని ఆర్డీవో గారికి నేను సూచించానని,మీ అందరికీ ఆర్థిక భరోసా కలగాలనే దిశగా త్వరితగతిన చర్యలు తీసుకుంటాంమని ఎమ్మెల్యే వివరించారు.
ఇందులో ఎవరైనా ఈ పార్టీ, ఆ పార్టీ అని తేడా లేదనీ,మీరు చూపిన త్యాగం మన సమాజానికే గౌరవం తెచ్చే విషయమని,అందుకే ప్రతీ ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తు చేశారు.ఈ ప్రాజెక్టు పూర్తయి రైతుల పొలాలు పచ్చదనంతో కళకళలాడినప్పుడు, మీ త్యాగం ఫలితాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారనీ,మీరు చేసిన త్యాగాన్ని చరిత్ర స్మరించుకుంటుందని వెల్లడించారు. మీ అందరి మద్దతు, ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని,మీ కోసం, మీ హక్కుల కోసం నేను ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.