calender_icon.png 30 August, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

29-08-2025 11:03:14 PM

వనపర్తి టౌన్: గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు తప్పులు లేని జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఆగస్టు 28న గ్రామ పంచాయతీల వారిగా ఎలక్ట్రాల్ రోల్ విడుదల చేసిన నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 

ప్రతి గ్రామ పంచాయతీలో ముసాయిదా ఓటరు జాబితా, వార్డుల వివరాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు ప్రకటించడం జరిగిందని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి జాబితాలో కానీ, వార్డుల విషయంలో కానీ పోలింగ్ కేంద్రాల విషయంలో ఏమైనా అవాంతరాలు ఉంటే మండల అభివృద్ధి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరి చేయించుకోవాలని సూచించారు.  ఆగస్టు 30 తేదీన మండల స్థాయిలో సైతం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందనీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. 

స్పందించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రకటించిన ఓటరు జాబితాలో  మరణించిన వారి పేర్లు సైతం జాబితాలో ఉన్నాయని వాటిని తొలగించాలని సూచించారు. స్పందించిన కలెక్టర్ గ్రామ పంచాయతీ వారిగా,మండలం వారిగా గుర్తించిన పేర్ల వివరాలు ఎంపీడీఓలకు ఇవ్వాల్సిందిగా సూచించారు.  వార్డుల విషయంలో సైతం ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎంపీడీఓ ల దృష్టికి తీసుకువెళ్లాలని తెలియచేశారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, డి.పి.ఓ రఘునాథ్ రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.