29-08-2025 10:50:48 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం తుది ఓటరు జాబితా, ముసాయిదా పోలింగ్ కేంద్రాల రూపకల్పనకు వివిధ రాజకీయ పార్టీలతో కలెక్టరేట్లో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించారు. మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీ లు, వార్డుల వారీగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 30 వరకు స్వీకరించడం జరుగుతుందని, అభ్యంతరాల పరిష్కారం అనంతరం వచ్చే నెల 2న వార్డు, గ్రామ పంచాయతీల వారీగా ఫోటోతో కూడిన తుది ఓటరు జాబితాను వెల్లడిస్తామని కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను అనుసరించి ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలను ఈ నెల 28 న ప్రదర్శించడం జరిగిందన్నారు. ముసాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 30 వరకు స్వీకరించడం జరుగుతుందని, 31న డీ పీ వో ఆధ్వర్యంలో అభ్యంతరాల పరిష్కారం జరుగుతుందని, అనంతరం సెప్టెంబర్ 2 న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ నెల 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆ సమావేశంలో పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాపై అభ్యంతరాలు తెలపవచ్చని కలెక్టర్ తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను ఈ నెల 31 న పరిష్కరించి తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.