29-08-2025 10:37:52 PM
నిర్మల్,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికల నేపథ్యంలో తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ఇప్పటికే ప్రదర్శించామని తెలిపారు.
ఈ జాబితాలపై అభ్యంతరాలను ఈ నెల 30వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. ఆ తరువాత సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ, వార్డు వారీగా ఫోటోలతో కూడిన తుది ఓటరు జాబితాను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా రాజకీయ పక్షాలు సహకరించాలని, ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాలపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా గడువులోగా సమర్పించాలని సూచించారు. అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాలో సవరణలు చేయడం జరుగుతుందని తెలిపారు.