బంగారం, వెండి ధగధగలు
తిరిగి రూ.74,000 దాటేసిన పసిడి
వెండి కొత్త రికార్డు ధర రూ.92,500
హైదరాబాద్, మే 16: ప్రపంచ మార్కెట్లో వువ్వెత్తున పెరిగిన ప్రభావంతో భారత్‌లోనూ వెండి బంగారాలు ధగధగలాడాయి. గురువారం హైద రాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఒక్క ఉదుటన రూ.770 మేర పెరిగి మళ్లీ రూ.74,000 స్థాయిని దాటేసింది. రూ.74,020 వద్ద నిలిచింది. బంగారం మూడు వారాల క్రితం రూ.74,340 వద్దకు చేరి కొత్త రికార్డును సృష్టించిన తర్వాత క్రమేపీ రూ.71,000 స్థాయికి తగ్గిన సంగతి తెలిసిందే. తాజాగా తిరిగి ఆ రికార్డుస్థాయిని సమీపించింది. 22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.700 పెరిగి రూ.67,850 వద్ద నిలిచింది. ఏప్రిల్ నెలలో యూఎస్ ద్రవ్యోల్బణం తగ్గిందన్న వార్తలతో యూఎస్ ఫెడ్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోనే వడ్డీ రేట్లను తగ్గింవచ్చన్న అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పుత్తడి ఫ్యూచర్ ధర మళ్లీ 2,400 డాలర్ల పైకి పెరగడంతో . దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో సైతం పూర్తి స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 స్థాయికి చేరింది.
వెండి వెలుగులు
ఈ దఫా పసిడికంటే ముందుగానే వెండి కొత్త రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,500 మేర పెరిగి రూ.92,500 వద్దకు చేరింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 30 డాలర్లను మించిన ప్రభావంతో దేశీయంగా కూడా అదేబాట అనుసరించిందని బులియన్ ట్రేడర్లు తెలిపారు. యూఎస్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడగానే అమెరికా డాలర్ ఇండెక్స్ ఐదు వారాల కనిష్ఠస్థాయికి పడిపోయిందని, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తగ్గాయని, ఇవి రెండు తగ్గడం విలువైన లోహాలకు సానుకూల అంశమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి చెప్పారు. రాగి, అల్యూమినియం, జింక్, లెడ్ తదితర కీలక పారిశ్రామిక లోహాల ధరలు జోరుగా పెరిగాయని, పరిశ్రమల్లో వినియోగించే వెండి ధర సైతం ఎగిసిందని జియోజిత్ ఫైనాన్షియల్ కమోడిటీస్ హెడ్ హరీశ్ వివరించారు. రికార్డు బంగారం ధరలు, రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు, యూఎస్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు తదితర అంశాలతో వెండి ర్యాలీ జరుపుతున్నదన్నారు.






