ఏడెకరాలకు రైతుభరోసా
- ఆరో రోజు 92,729 మంది రైతులకు రూ.354.96 కోట్లు జమ
- ఇప్పటీ వరకు 68.37 లక్షల మందికి లబ్ధి, వారి ఖాతాల్లో రూ.7,490.96 కోట్లు వేసి రికార్డు
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ఏడు పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీలు
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): ఆరో రోజు ఆరు నుంచి ఏడు ఎకరాల వరకు సోమవారం రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 92,729 మంది రైతులకు రూ.354.96 కోట్లు జమ చేసింది. ఇప్పటి వరకు ఆరు రోజులు వ్యవధిలోనే 68.37 లక్షల మంది రైతులు, 124.85 లక్షల ఎకరాల భూమలకు గాను వారి బ్యాంకుల ఖాతాల్లో రూ.7,490.72 కోట్లు జమ చేసి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తోందన్నారు. జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదలను ప్రారంభించిన ప్రభుత్వం కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే 68.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా కింద రూ.7,490.96 కోట్లను జమ చేసి రికార్డు సృష్టించినట్లు చెప్పారు.
అలాగే రాష్ట్రంలోని మరో 7 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ నాన్ ఆఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌లోని దేవంపల్లి, యాదాద్రి జిల్లాలోని భువనగిరి, చందుపట్ల, బీబీనగర్, వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి, వికారాబాద్ జిల్లాలోని పూడూరు పీఏసీఎస్‌లకు ప్రత్యామ్నాయ నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 20 పీఏసీఎస్‌లను ప్రత్యామ్నాయ నాన్ ఆఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీలుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలు వెంటనే బాధ్యతలు స్వీకరించి ఆయా సహకార సంఘాల నిర్వహణను పర్యవేక్షించనున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.






