ఇంట్లో చొరబడి చైన్ స్నాచింగ్
వృద్ధురాలి మెడలో ఆరు తులాల బంగారు గొలుసు చోరీ
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ఎల్బీనగర్: ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఓ మహిళా చైన్ స్నాచర్ ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉన్న వృద్ధురాలు మెడలో బంగారు గొలుసు లాక్కొని పరారైన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. వనస్థలిపురం పీఎస్ పరిధిలోని సహారా ఎస్టేట్ లో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి డాక్టర్ నిరంజన్, ఆయన భార్య రామసుందరి(75) నివసిస్తున్నారు.
ఉదయం నిరంజన్ మార్నింగ్ వాక్ వెళ్ల గా భార్య ఇంట్లోనే ఉంది. ఇదే అదనుగా భావించిన ఒక మహిళా చైన్ స్నాచర్ ఇంట్లోకి చొరబడింది. రామ సుందరి కంట్లో కారం చల్లి, చెయ్యి కొరికి మెడలో ఉన్న ఆరు తులాల బంగారు గొలుసును లాక్కెళ్ళింది. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న వనస్థలిపురం పోలీసులు.. కేసు నమోదు చేసి సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. చైన్ స్నాచింగ్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




