ఆడపిల్ల పెండ్లికి బంగారం
- యువతకు ఉచితంగా ఏఐ శిక్షణ, ఉచిత ల్యాప్ ట్యాప్‌లు
- విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
- తమిళనాడు బడ్జెట్‌లో వరాలు
- సీఎంగా విజయ్ తొలి బడ్జెట్
చెన్నై, ఆగస్టు 5: తమిళనాడు సీఎంగా విజయ్ ఎన్నికైన అనంతరం తొలిసారిగా బుధవారం అసెంబ్లీలో పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్య, నైపుణ్యాభివృద్ధి, యువత సంక్షేమం, మహిళా సంక్షేమం, మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేశారు. ఈ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఎన్ మేరీ విల్సన్ ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ‘అన్నన్ సీర్ తిట్టమ్’ అనే పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా పెళ్లికూతురుకు 8 గ్రాముల బంగా రం, ఒక పట్టు చీర అందించనున్నారు.
ఇందుకోసం రూ. 812 కోట్లు కేటాయించారు. 2031 నాటికి ఐదు లక్షల మందికి ఏఐలో శిక్షణ ఇస్తామని ప్రకటించారు. వెట్రిథిరన్ ట్రైనింగ్ స్కీమ్ కింద దశలవారీగా లక్షమంది ఉద్యోగార్థులు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందనున్నారు.ఈ పథకం కింద విద్యార్థులకు రూ. 2వేల కోట్లతో ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లను అందించనున్నారు. ప్రభు త్వ పాఠశాలల ఆధునికీకరణకు ఏడాదికి రూ. 300 కోట్లు కేటాయించారు. ‘పుతియా పయనం పుతియా వేగం’ పథకం కింద 11వ తరగతి చదివే 5.3 లక్షల మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందించనున్నారు.
సామాజిక సంక్షేమం, మహిళలకు రూ. 9,818 కోట్లు, ‘తైమామన తంగ మోతిరం’ నవజాత శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరం పథకానికి రూ. 560 కోట్లు, గిరిజన వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ‘మట్టికూతురు’ పథకానికి రూ. 20 కోట్లు, క్రైస్తవ, ముస్లిం మహిళా సహాయక సంఘాలకు రూ. 1.06 కోట్లు, ‘మదర్ కేర్’కు రూ. 23 కోట్లు, వితంతువులు, నిరుపేద మహిళలు, ట్రాన్స్‌జెండర్ మహిళలు, దివ్యాంగుల జీవనోపాధికి రూ. 110 కోట్లు, పాలిచ్చే ఆవులను అందజేసేందుకు రూ. 57 కోట్లు,
మహిళా స్వయం సహాయక బృందాలను సూక్ష్మ సంస్థలుగా మార్చేందుకు రూ. 38 వేల కోట్లు, మహిళల భద్రతకు రూ. 354 కోట్లు, పాఠశాలల్లో సూపర్ క్లీన్ కార్యక్రమానికి రూ. 139 కోట్లు, హజ్ యాత్ర సబ్సిడీని రూ. 25వేల నుంచి రూ. 35వేలకు పెంపు, న్యాయకళాశాల స్థాపనకు రూ. 90 కోట్లు, మాదక ద్రవ్య రహిత తమిళనాడుకు రూ. 7 కోట్లు, 200 ఉచిత విద్యుత్ కొనసాగించడం, 717 మద్యం దుకాణాలను మూసివే స్తున్నట్లు మంత్రి విల్సన్ ప్రకటించారు.






