2 April, 2026 | 6:35 AM

కాంగ్రెస్‌కు స్వర్ణం బీఆర్‌ఎస్‌కు రజతం!

03-05-2024 12:48 AM

టీవీ9 కు ప్రధాని మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూ

అవినీతిలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ రెండే

రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ 

కమీషన్ లేకుండా ఒక్క పనీ జరగట్లేదు

లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్‌పై కత్తి వేలాడుతోంది

ఎన్డీయేలో బీఆర్‌ఎస్ చేరే ప్రసక్తే లేదు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు స్వయంగా అడిగినా ఒప్పుకోలేదు

రాజ్యాంగం అంటే మాకు ఎంతో గౌరవం

ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మే 2: అవినీతిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ పడుతున్నాయని, ఈ పోటీలో కాంగ్రెస్‌కు బంగారు పతకం ఇవ్వాలని, బీఆర్‌ఎస్‌కు రజతం పతకం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఒక పార్టీ విన్నర్ అయితే.. మరో పార్టీ రన్నర్ అంటూ చురకలు అంటించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కాంగ్రెస్‌కు ఏటీఎం మాదిరిగా మారాయంటూ ఆరోపించారు. తెలంగాణలో అతిపెద్ద అవినీతి రాకెట్ నడుస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొందూ దొందేనని మండిపడ్డారు. లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్‌పై కత్తి వేలాడుతోందని చెప్పారు. ఇక తెలంగాణలో ట్రిపుల్ ఆర్ సినిమా లాగా.. డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందన్నారు. తెలంగాణలో కమీషన్ లేకుండా ఎలాంటి పనులు జరగట్లేదని మోదీ టీవీ౯ ఇంటర్వ్యూలో చెప్పారు. 

ఎన్డీయేలో కేసీఆర్ చేరుతారా?

‘కేసీఆర్ ఎప్పుడూ అబద్ధాలు చెబుతారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇలాగా చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు నా దగ్గరికి వచ్చారు. ఎన్డీయేలో చేరుతానని స్వయంగా అడిగారు. అయితే నేను అందుకు ఒప్పుకోలేదు. ఒంటరిగానే పోటీ చేస్తానని కరాఖండీగా చెప్పాను. వచ్చే ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తాం. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయి’ అని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ‘ఒకరినొకరు కవర్ చేసుకుంటున్నారు’ అంటూ ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు.

ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారో?

ఒకప్పుడు అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు వేరేలా ఉండేవని ప్రధాని మోదీ చెప్పారు. 2019 వరకు రాష్ట్రాల ప్రభావం అంతగా ఉండేది కాదని చెప్పారు. ఇప్పుడు ప్రజలు దేశం గురించి ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఎవరు అనే దానిపై ప్రజల ఆలోచన ఉందని చెప్పారు. ఇండి యా కూటమిలో ఎవరు ప్రధాని అభ్యర్థి అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో ఏ ఒక్క పార్టీ కూడా మెజారిటీ కోసం 272 సీట్లలో పోటీ కూడా చేయట్లేదని, అలాంటిది వారు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. సంవత్సరానికో ప్రధానమంత్రిని చేయాలని ఇండియా కూటమి చూస్తోందని ఎద్దేవా చేశారు.

ఎప్పుడో చేసేవాళ్లం..

గత పదేళల్లో ఎన్డీయేకు 400 సీట్లు ఉన్నాయని, కానీ ఎప్పుడూ రాజ్యాంగాన్ని మార్చాలని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి పాపం చేయాలంటే మెజారిటీ సీట్లతో ఎప్పుడో చేసి ఉండేవారిమని చెప్పారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న దానిలో ఎలాంటి నిజం లేదని పునరుద్ఘాటించారు. ‘సొంత పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించలేని పార్టీ కాంగ్రెస్. అలాంటిది దేశ రాజ్యాంగాన్ని ఎలా గౌరవిస్తుంది. రాజ్యాంగ పవిత్రతను దెబ్బతీసే పనులు వారి కుటుంబాలే చేశా యి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని సొంత పార్టీనే ఓడించింది. వాళ్లు ఎప్పుడూ రాజ్యాంగంతో ఆటలు ఆడుతుంటారు. అది వారికి అలవాటు. జవహార్‌లాల్ నెహ్రూ పార్లమెంటులో తొలిసారి మాట్లాడినప్పుడు మాట్లాడే హక్కును హరించారు. ఒకే ప్రధాని 50 సార్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు’ అని విమర్శించారు. 

బుజ్జగింపు రాజకీయాలు

కాంగ్రెస్ అధికారం కోసం, ఓటు బ్యాంకు కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ బీజేపీ అలాంటి రాజకీయాలు చేయదని చెప్పుకొచ్చారు. వయనాడ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని ఒప్పందం చేసుకుని రాహుల్ గాంధీ గెలిచారా అంటూ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లభించిన రిజర్వేషన్లను లాక్కుని ముస్లింలకు ఇవ్వాలని చూస్తున్నారని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని అంబేద్కర్ అప్పుడే చెప్పారని, పార్లమెంటులో కూడా దీనిపై పెద్ద చర్చ జరిగిందని, అందరూ ఏకగ్రీవంగా మతపరమైన రిజర్వేషన్లు ఉండొద్దని ఆమోదించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలని కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. కర్ణాటకలో రాత్రికి రాత్రి ఉత్తర్వులు తీసుకొచ్చి ఓబీసీల రిజర్వేషన్లు లాక్కుని ముస్లింలకు ఇచ్చారని దుయ్యబట్టారు.

పీవీని అవమానించారు.. 

దేశంలో మళ్లీ లైసెన్స్ రాజ్ తీసుకురావాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్న దని ఆరోపించారు. లైసెన్స్ రాజ్‌ను రద్దు చేశారనే కోపంతోనే పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమానిం చిందని గుర్తు చేశారు. దేశంలో మళ్లీ లైసెన్స్ రాజ్ తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారని, ఇందుకు కాంగ్రెస్ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. 

కశ్మీర్‌లో ఎందుకు అమలు చేయలేదు..?

రాజ్యాంగం అంటే అంత అభిమానం ఉన్నవాళు 60 ఏళ్లలో జమ్మూ కశ్మీర్‌లో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇది అంబేద్కర్‌ను అవమానించడమే అని చెప్పారు. అక్కడి దళితులకు 70 ఏళ్ల దాకా రిజర్వేషన్లు లభించలేదని గుర్తుచేశారు. అయితే తాను కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ముస్లిం లీగ్ మ్యానిఫెస్టో అని సంబోధించలేదని స్పష్టం చేశారు. అయితే ముస్లిం లీగ్ ఆలోచనా విధానంతో రూపొందించారని, ముస్లిం లీగ్ ఎజెండాతోనే కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఉందని విమర్శించారు. కాంగ్రెస్ తీరు నచ్చకే నేతలు పార్టీని వీడుతున్నారని చెప్పారు. 

నేర్చుకో తమ్ముడూ..

రేవంత్‌రెడ్డి బడేభాయ్ అంటూ ప్రధానిని సంబోధించడంపై మోదీ స్పందించారు. తన దగ్గరి నుంచి విషయాలు నేర్చుకో తమ్ముడూ అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ సూచించారు. ‘నన్ను బడేభాయ్ అని రేవంత్‌రెడ్డి అంటే సంతోషమే. పెద్దల నుంచి చిన్న వాళ్లు విషయాలు నేర్చుకోవాలి. నాకు దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా, పీఎంగా పనిచేసిన అనుభవం ఉంది. కానీ ఒక్క మచ్చ కూడా లేదు నాపై. నేర్చుకో తమ్మూడూ.. పెద్దన్న పెద్దన్న అంటూ నా వెంట తిరగడం కాదు.. మీరు కూడా మంచి పనులు చేసి పుణ్యం కట్టుకో’ అంటూ చమత్కరించారు.