2 April, 2026 | 8:32 AM

రాత్రి పది దాటితే పవర్ కట్

03-05-2024 12:44 AM

ఓవర్‌లోడ్‌తో ట్రిప్ అవుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు 

విద్యుత్ అధికారుల విఫలం

హబ్సిగూడ డివిజన్‌లో వినియోగదారుల అవస్థలు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2 (విజయక్రాంతి) : వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా రోజురోజుకు విద్యుత్ వినియోగం అత్యధికంగా పెరుగుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆన్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లపై అధిక లోడ్ పడటంతో తరుచూ ట్రిప్ అవుతూ విద్యుత్ అంతరాయం ఏర్పాడుతుంది. గతేడాది మే నెలలో కొనసాగిన విద్యుత్ డిమాండ్, వినియోగం ఈ ఏడాది ఏప్రిల్ మాసంలోనే రికార్డులు నమోదవుతున్నట్టు అధికారులు చెబుతున్నా.. అందుకు సరిపడ విద్యుత్ లోడ్‌ను అంచనా వేసి, సంబంధిత ఏర్పాట్లను చేయడంలో అధికారులు విఫలమ య్యారని స్పష్టమవుతోంది. ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయకపోవడంతోనే ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. 

పెరుగుతున్న విద్యుత్ వినియోగం

మేడ్చల్ జోన్ హబ్సీగూడ సర్కిల్ పరిధిలో 3 డివిజన్లు, 8 సబ్ డివిజన్లు, 26 సెక్ష న్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఈ పరిధిలో దాదాపు 78లక్షల వరకు వినియో గదారులు ఉన్నారు. ముఖ్యంగా గృహ వినియోగదారులే సుమారు 68 లక్షలకు పైగా ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. ఈ పరిధిలో 33/11 కేవీ 55, 132/33 కేవీ 1, 220/132 కేవీ 3 సబ్ స్టేషన్లు, 33 కేవీ ఫీడర్లు 48, 11 కేవీ ఫీడర్లు 336, పీటీఆర్‌లు 114, డిటీఆర్‌లు 11788 ఉన్నాయి. ఒక్క హబ్సీగూడ డివిజన్ పరిధిలోనే దాదాపు 3900 ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. 

పది దాటితే.. పవర్ కట్ 

హబ్సీగూడ సర్కిల్ పరిధిలో హబ్సీగూడ, కీసర, సైనిక్‌పూరి డివిజన్లు కొనసాగుతుండగా, ఇటీవల నాగారం దమ్మాయిగూడలో మాజీ మంత్రి మాట్లాతుండగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈ సమయంలో పై అధికారులకు సమాచారం లేకుండానే ఎల్ సీ తీసుకున్నారనే కారణంతో కీసర డిఈ భాస్కర్‌రావు సస్పెండ్ అయ్యారు. ఇదే క్రమంలో ప్రస్తుతం హబ్సీగూడ డివిజన్‌లోని చిలకానగర్, రామాంతాపూర్, బొడు ప్పల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో తరుచూ విద్యత్ సరఫరా నిలిచిపోతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. ముఖ్యంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా కోతలు ఉంటున్నాయని పలువురు వాపోయారు. రాత్రి 10గంటల తర్వాత ఈ కోతలు విపరీతంగా ఉంటున్నట్టు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

అధిక లోడుతోనే..  డీఈ సాయిప్రసాద్

వాస్తవానికి గతంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈ వేసవిలో విపరీతమైన విద్యుత్ వినియోగం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లకు అధిక లోడ్ పడుతున్న కారణంగానే విద్యుత్ కోతలు ఉంటున్నాయి. వీటిని పరిష్కరించేందుకు స్థానిక సెక్షన్ల నుంచి వివరాలు తెప్పించుకున్నాం. కావాల్సిన అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. ముఖ్యంగా బొడుప్పల్ ప్రాంతంలో వచ్చే అధిక లోడ్ సమస్యను అధిగమించేందుకు 100కేవీ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో 160కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయనున్నాం.