అక్షయ తృతీయ రోజున పుత్తడి మెరుపులు
ఒక్క రోజులో రూ.900 పెరిగిన ధర
హైదరాబాద్, మే 10: కొద్ది రోజులుగా స్తబ్దుగా ట్రేడవుతున్న బంగారం ధర ఒక్కసారిగా అక్షయ తృతీయ రోజున రివ్వున దూసు కెళ్లింది. పుత్తడి కొనుగోళ్లకు శుభదినంగా భావించే అక్షయ తృతీయ పండుగ రోజైన శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.930 మేర పెరిగి రూ.73,090 వద్దకు చేరింది. బంగారం మూడు వారాల క్రితం రూ.74,340 వద్దకు చేరి కొత్త రికార్డును సృష్టించిన తర్వాత క్రమేపీ రూ. 71,000 స్థాయికి తగ్గిన సంగతి తెలిసిందే. తాజాగా 22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ. 850 పెరిగి రూ.67,000 వద్ద నిలిచింది. ఇంతగా ధర పెరగడానికి మన దేశంలో అక్షయ తృతీయ కారణం కాదు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గించవచ్చంటూ తాజా అంచనాలు ఏర్పడటంతో ఇన్వెస్టర్లు తిరిగి బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పుత్తడి ఫ్యూచర్స్ ధర 2,379 డాలర్ల స్థాయికి చేరింది. ఫలితంగా దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో సైతం పూర్తి స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర రూ. 900పైగా పెరిగి రూ.72,547 స్థాయికి చేరిం ది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలకు బదు లు రేట్లను యథాతథంగా అట్టిపెట్టడంతో యూఎస్ డాలరు క్షీణించిందని, ఫలితంగా ప్రపంచ మార్కెట్లో ఒక్క ఉదుటన పుత్తడి ధర పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీ హెడ్ అనూజ్ గుప్తా వివరించారు. బంగారం కొనుగోళ్లకు శుభదినం గా భారతీయులు పరిగణించే అక్షయ తృతీ య సందర్భంగా డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలు కూడా ధర పెరుగుదలకు కారణమని చెప్పారు.
పండుగ డిమాండ్ అంతంతే..
అక్షయ తృతీయ రోజున గిరాకీ అంతంతమాత్రంగానే ఉన్నదని జ్యువెలర్స్ చెపుతు న్నారు. బంగారం ధర తక్కువరోజుల్లోనే అత్యంత వేగంగా పెరగడం ఇందుకు కారణమన్నారు. పెరిగిన ధర కారణంగా వినియో గదారులు వెనుకంజ వేస్తున్నారని, గత అక్షయ తృతీయకంటే ఈ దఫా అమ్మకాలు 10 నుంచి 20 శాతం తక్కువేనన్న అంచనాలను బులియన్ ట్రేడర్లు వెల్లడిస్తున్నారు.
వచ్చే అక్షయ తృతీయనాటికి రూ.85 వేలకు ధర!
గత ఏడాది అక్షయ తృతీయనాటి నుంచి బంగారం ధర 20 శాతంపైగా పెరిగిందని, వచ్చే ఏడాది ఇదే పండుగకల్లా ధర మరింత పెరిగి రూ.80,000 వరకూ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ హెడ్ అనూజ్ గుప్తా చెప్పారు. ఎక్కువకాలం వేచిచూడగల ఇన్వెస్టర్లు ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ.69,000 స్థాయికి తగ్గితే కొనుగోలు చేయవచ్చని సూచించారు.






