టాటా మోటార్స్ లాభాల పంచ్
అంచనాల్ని అధిగమించిన ఆర్థిక ఫలితాలు
నికరలాభం రూ.17,529 కోట్లు
అమ్మకాల ఆదాయం రూ.1.20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ, మే 10: ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ విశ్లేషకుల అంచనాల్ని మించిన ఫలితాలతో అదరగొట్టింది. కొత్త మోడల్ ‘పంచ్’తో దేశీయ కార్ల మార్కెట్లో రెండు నెలల నుంచి నంబర్‌వన్‌గా ఉన్న టాటా మోటార్స్ 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ.17,529 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదేకాలంలో నమోదు చేసిన రూ.12,033 కోట్ల నికరలాభంతో పోలిస్తే తాజా త్రైమాసికంలో 46 శాతం వృద్ధి సాధించింది. మెజా రిటీ విశ్లేషకులు రూ.6,250 కోట్ల నికరలాభాన్ని ఆర్జించవచ్చని అంచనావేయగా అంత కు దాదాపు మూడింతల లాభాన్ని కనపర్చింది. తాజా త్రైమాసికంలో కంపెనీ ఆదా యం 13.3 శాతం వృద్ధిచెంది రూ.1.20 లక్షల కోట్లకు పెరిగింది. ఇది మార్కెట్ అంచనాలకంటే కాస్త తక్కువ. శుక్రవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.6 చొప్పున డివిడెండు సిఫార్సుచేసింది. కంపెనీ ఏజీఎంలో షేర్‌హోల్డర్ల అనుమతి పొందిన తర్వాత జూన్ 28లోపు డివిడెండు చెల్లిస్తారు. క్యూ4లో టాటా మోటార్స్ ఇబిటా 26.6 శాతం వృద్ధితో రూ.11,000 కోట్ల నుంచి రూ. 17,900 కోట్లకు పెరిగింది. రూ.9,500 కోట్ల పన్నుకు ముందు లాభం ఆర్జించింది. ఈ పూర్తి ఆర్థిక సంవత్సరంలో దేశీయ డిమాండ్ పట్ల టాటా మోటార్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేసిం ది. ప్రధమార్థంలో డిమాండ్ బలహీనంగా ఉంటుందని, ద్వితీయార్థంలో బలంగా ఉంటుందన్నది. ప్రీమియం లగ్జరీ కార్ల డిమాండ్ జోరుగా ఉన్నదని, 2024 ఆర్థిక సంవత్సరంలో పటిష్టమైన ఆర్థిక పనితీరును ప్రదర్శిస్తామని తెలిపింది.
జోరుగా జేఎల్‌ఆర్ బుకింగ్స్
టాటా మోటార్స్ బ్రిటన్ సబ్సిడరీ జాగ్వర్ అండ్ ల్యాండ్‌రోవర్ (జేఎల్‌ఆర్) మార్చితో ముగిసిన క్యూ4లో 7.9 బిలియన్ పౌండ్లు, 2023 పూర్తి ఆర్థిక సంవత్సరంలో 29 బిలియన్ పౌండ్ల చొప్పున ఆదాయాన్ని నమోదుచేసింది. పూర్తి ఏడాదిలో పన్నుకు ముందు లాభం 2.2 బిలి యన్ పౌండ్లకు చేరింది. ఇబిటా మార్జిన్ క్యూ4లో 9.2 శాతంకాగా, పూర్తి ఏడాదిలో 8.5 శాతంగా ఉన్నది. 2024 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 1,33,000 వాహనాల ఆర్డర్లు ఉన్నాయని, అందులో 76 శాతం రేంజ్ రోవర్, ఆర్‌ఆర్ స్పోర్ట్, డిఫెండర్‌లు ఉన్నాయని వెల్లడించింది.






