వరుస పతనాలకు బ్రేక్
సెన్సెక్స్ 260 పాయింట్ల రికవరీ
ముంబై, మే 10: దేశీయ స్టాక్ మార్కెట్ ఐదు రోజులు చవిచూస్తున్న వరుస పతనాలకు శుక్రవారం బ్రేక్ పడింది. కనిష్ఠ స్థాయిలో ట్రేడవుతున్న షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడం, డెరివేటివ్ విభాగంలో జరిగిన షార్ట్ కవరింగ్ ఫలితంగా స్టాక్ సూచీలు కొంతమేర కోలుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 72,664 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తిరిగి సాంకేతికంగా కీలకమైన 22,000 పాయింట్ల స్థాయిని చేజిక్కించుకుంది. 98 పాయింట్లు పెరిగిన ఈ సూచి 22,055 పాయింట్ల వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 540 పాయింట్ల మేర, నిఫ్టీ 150 పాయింట్లకుపైగా పెరిగినప్పటికీ, చివరివరకూ ఆ లాభాల్ని పరిరక్షించుకోలేకపోయాయి. విదేశీ ఫండ్స్ అమ్మకాలు కొనసాగడం, దేశీయ ఇన్వెస్టర్లు ఎన్నికల సందర్భంగా జాగ్రత్త వహించడంతో భారీ లాభాలు చేకూరలేదని ట్రేడర్లు వివరించారు. వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,213 పాయింట్లు, నిఫ్టీ 420 పాయింట్ల చొప్పున క్షీణించాయి.
అంతర్జాతీయ సంకేతాల సానుకూలతతో షార్ట్ కవరింగ్ జరిగినందున సూచీలు స్వల్పలాభాలతో ముగిసాయని, కానీ సెంటిమెంట్ బలహీనంగానే ఉన్నదని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ సూచీలు లాభపడగా, యూరప్ ప్రధాన మార్కెట్లు బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు గ్రీన్‌లో ముగిసాయి. యూఎస్ వడ్డీ రేట్లు తగ్గుదలకు అనుగుణంగా ఆ దేశపు గణాంకాలు వెలువడుతున్నందున గ్లోబల్ ఈక్విటీ లు శుక్రవారం పాజిటివ్‌గా ట్రేడయ్యాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని తెలిపారు.
4వ దశ పోలింగ్‌పై కన్ను
లోక్‌సభ ఎన్నికల 4వ దశ పోలింగ్ సోమవారం జరగనున్నందున, వచ్చేవారం సూచీలు ఒడిదుడుకుల బాట పట్టవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు కొంత జాగ్రత్త వహించారని మోతీలాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖెమ్కా చెప్పారు. ఇన్వెస్టర్లలో భయాలను సూచించే వొలటాలిటీ ఇండెక్స్ (వీఐఎక్స్) 52 వారాల గరిష్ఠస్థాయి 18.5 వద్దనే ఉన్నదన్నారు. విస్త్రత శ్రేణిలో మార్కెట్ కన్సాలిడేట్ కావచ్చని తాము అంచనా వేస్తున్నట్టు తెలిపారు.
ఐటీ షేర్లలో అమ్మకాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ దన్నుతో స్టాక్ సూచీలు లాభపడినప్పటికీ, ఐటీ షేర్లలో తాజా అమ్మకాలు జరిగాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలు 1.5 శాతం వరకూ తగ్గాయి. వీటితో పాటు కోటక్ మహీంద్రా బ్యాంక్, లార్సన్ అండ్ టుబ్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు నష్టాలతో ముగిసాయి. మరోవైపు పవర్‌గ్రిడ్ , ఎన్టీపీసీ, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, భారతి ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యూనీలీవర్, టాటా మోటార్స్ 4 శాతం వరకూ లాభపడ్డాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా యుటిలిటీస్ ఇండెక్స్ 1.61 శాతం పెరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.38 శాతం, పవర్ ఇండెక్స్ 1.53 శాతం, కమోడిటీస్ సూచి 1.32 శాతం, టెలికమ్యూనికేషన్స్ 1.30 శాతం, ఆటోమొబైల్ 1.07 శాతం చొప్పున పెరిగాయి. ఐటీ, బ్యాంకింగ్, రియల్టీ, టెక్నాలజీ సూచీలు తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచి 0.81 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.80 శాతం చొప్పున పెరిగాయి.
కొనసాగిన ఎఫ్‌పీఐల అమ్మకాలు
కొద్ది రోజుల నుంచి అదేపనిగా నిధుల్ని మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) శుక్రవారం సైతం విక్రయాలు జరిపారు. తాజాగా ఎఫ్‌పీఐలు రూ. 2,117 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి రూ. 21,000 కోట్లకుపైగా వెనక్కు తీసుకున్నారు.






