తిరిగి తగ్గిన బంగారం
04-05-2024 12:05 AM
హైదరాబాద్, మే 3: క్రితం రోజు స్వల్పంగా కోలుకున్న బంగారం ధర శుక్రవారం తిరిగి తగ్గింది. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెడుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో కమోడిటీలు క్షీణిస్తున్న కారణంగా బంగారం సైతం తగ్గడంతో దేశీయంగా ధర దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర 2,300 డాలర్ల స్థాయికి తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.540 మేర తగ్గి, రూ.71,730 వద్దకు చేరింది. ఇది 10 రోజుల క్రితం రూ.74,340 వద్దకు చేరి కొత్త రికార్డును సృష్టించిన సంగతి విదితమే. 22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.500 క్షీణించి రూ.65,750 వద్ద నిలిచింది.






