09-01-2026 12:00:00 AM
నంగునూరు, జనవరి 8: ఒకప్పుడు కేవలం భూసారం పెంచే ’పచ్చిరొట్ట’ పంట గా మాత్రమే పరిగణించిన జనుము, నేడు రైతులకు కాసుల పంటగా మారుతోంది. తక్కువ నీరు, స్వల్ప పెట్టుబడితో విత్తనోత్పత్తి చేపడుతూ అన్నదాతలు ఆశించిన దానికంటే మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. జిల్లాలో నాలుగేళ్ల క్రితం వరకు నామమాత్రంగా ఉన్న జనుము సాగు, నేడు ఏకంగా 998 ఎకరాలకు విస్తరించడం విశేషం.
తక్కువ శ్రమ.. ఎక్కువ లాభం..
నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకు జనుము సాగు వరంగా మారింది. ఈ పంట కాలం 120 రోజులు మాత్రమే. ఎకరాకు కేవలం 8 కిలోల విత్తనంతో 3 నుండి 4 తడులతోనే ఎకరాకు సగటున 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. ప్రస్తుతం మా ర్కెట్లో జనుము క్వింటాలుకు సుమారు రూ.8వేల ధర పలుకుతోంది. అన్ని ఖర్చులు పోను ఎకరాకు రూ.35వేలు ఆదాయం లభిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. అక్టోబరు, నవంబరు నెలల్లో సాగు చేపడితే వాతావరణం అనుకూలించి ఆశించిన లాభాలు వస్తున్నాయి.
వన్యప్రాణుల బెడద లేదు..
పంటకు చీడపీడల బెడద చాలా తక్కువ. పంట పొలాలను నాశనం చేసే కోతులు, అడవి పందులు ఈ పంటను ఆశించవు. దీనివల్ల రైతులకు కాపలా భారం తప్పడమే కాకుండా, మానసిక ప్రశాంతత లభిస్తోంది. జనుము సాగు వల్ల భూసారం పెరిగి, పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుంది.
విస్తరిస్తున్న సాగు..
జిల్లాలోని చేర్యాల, హుస్నాబాద్ డివిజన్లతో పాటు నంగునూరు మండల కేంద్రం, సిద్దన్నపేట, అక్కెనపల్లి, గట్లమల్యాల గ్రామాల్లో రైతులు కొత్తగా ఈ సాగును చేపట్టి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
ప్రభుత్వమే కొనుగోలు చేస్తే మరిన్ని లాభాలు..
చాలా ఏళ్ల నుంచి వరి, మొ క్కజొన్న లాంటి సంప్రదాయ పంటలే వేసేవా ణ్ణి. కానీ ఎప్పు డూ ఒకటే సమస్య. పెట్టుబడి ఎక్కువ, కూలీల ఖర్చు భారంగా ఉండేది. ఇ ప్పుడు నేను ఎకరం జనుము సాగు చేశాను. విత్తనాలు కొనే దగ్గర నుండి, పంట పండాక అమ్ముకునే వరకు ప్రైవేటు కె,ప్రభుత్వం దృష్టి సారించి, మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తే మాకు భరోసా ఉంటుంది.
ముడికే రాజయ్య,
రైతు, గట్లమల్యాల
అవగాహన కల్పిస్తున్నాం..
తక్కువ నీటి సౌకర్యం ఉన్న రైతులు జనుము విత్తనోత్పత్తిని ఎంచుకోవడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చు. నంగునూరు మండలం లో సుమారు 40 ఎకరాల వరకు రైతులు సాగు చేశారు. ఇప్పుడిప్పుడే రైతులు ఈ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని గ్రామాలకు ఈ సాగును విస్తరించేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం.
గీత, మండల వ్యవసాయ అధికారి, నంగునూరు