నిరుపయోగంగా ఎస్టీ బాలుర వసతి గృహం
ఉట్నూర్, జూలై 26: ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణులై పైచదువులు చదివేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్టి బాలుర వసతి గృహం నిరుపయోగంగా దర్శనమిస్తుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో రూ. 50 లక్షలతో నిర్మించిన వసతి గృహం ప్రారంభించిన సమయంలో ఇంద్రవెల్లి మండలానికి మంజూరైన ఏకలవ్య మోడల్ స్కూల్ కు మూడేళ్ల పాటు ఈ భవనాన్ని వినియోగించారు.
ఇంద్రవెల్లి ఏకలవ్య మోడల్ స్కూల్ కు పిట్ట బొంగరం గ్రామ పంచాయతీ పరిధిలోని పాటగూడలో పక్కా భవనం పూర్తి కాగానే అందులోకి ఏకలవ్య మోడల్ స్కూల్ ను మార్చారు. అప్పటి నుంచి ఈ ఎస్టీ బాలల వసతిగృహం నిరుపయోగంగా ఉంది. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఇంటర్ చదివే విద్యార్థులతో పాటు మండల కేంద్రంలోని డిగ్రీ ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులు మారుమూల గిరిజన గ్రామాల నుంచి రాకపోకలు సాగించడంతో వారి చదువులు అంతంత మాత్రాంగనే జరుగుతున్నాయని విద్యార్థులు అంటున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుని ఈ వసతి గృహాన్ని ప్రారంభించి చదువులు కొనసాగే విధంగా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.






