వాహన దొంగతనాలకు పాల్పడే ముఠా గుట్టు రట్టు
కేసును చేదించిన నేరడిగొండ పోలీసులు
16 మంది నిందితులపై కేసు నమోదు పది మంది అరెస్ట్ ఆరుగురు పరారీ
ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, జూలై 26 (విజయక్రాంతి): కొద్ది నెలలుగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలలో నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ముఠాను జిల్లా పోలీసులు పట్టుకున్నారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఆదివారం పోలీస్ ఎ.ఆర్ హెడ్ క్వాటర్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నెల 21న ఆదిలాబాద్ పట్టణంలో రిమ్స్ ఎదురుగా ఒక ఆటోను దొంగతనం చేయ డానికి ప్రయత్నించిన ముఠా సభ్యులను ఎలాగైనా పట్టుకోవాలని ఉద్దేశంతో ప్రత్యేక తనిఖీలను ఏర్పాటు చేశాం.
నిందితులు ఈ నెల 24న రాత్రి సమయంలో కుప్టి ఘాట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. అందులో నుంచి ఇద్దరు కారు దిగి, ఒకరు కత్తి తీసి మమ్ములనే అపుతావా, చంపుతా అని బెదిరించగా, మరో వ్యక్తి పోలీసులను నెట్టేసి కారులో తప్పించుకొని పారిపోయారు.
25న ఆ నిందితులను ఎలాగైనా పట్టుకోవాలని వాంకిడి చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ఆ కారును అపి అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోని విచారించే అసలు విషయం బయటపడింద న్నారు. నిందితులలోని ప్రధాన సభ్యులు యాసర్, సోహెల్ వాహన డ్రైవర్లుగా పని చేస్తూ ఊర్లను తిరుగుతూ దొంగలించవ లసిన వాహనాలను గుర్తించి, ముఠా సభ్యులకు తెలియజేస్తారని, ఈ ముఠా సభ్యులు వచ్చి, ఒక కారును కిరాయికి తీసుకోని పార్క్ చేసి ఉన్న వెహికల్స్ ను, తమ ముఠా సభ్యులైన తొమ్మిది మంది నేరస్తులతో కలిసి దొంగలించి ఇఫ్ధికర్, షైక్ అబుతాలకు అమ్మేవారని తెలిపారు.
16 మంది గల ఈ ముఠాలో పది మంది నేరస్తులను ఆదివారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఏడు బైక్ లు, మూడు ఆటోలు, ఎనిమిది సెల్ ఫోన్లు, కత్తి, కారు, 1500 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బహిరంగ మార్కెట్లో ఏడు ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోల విలువ దాదాపు రూ. 17 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
సురక్షిత ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలి...
జిల్లాలో వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయాలని, వీలైనంత వరకు సీసీటీవీ నిఘా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా వాహన చోరీలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు, లేదా డయిల్ 100కు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
నంబర్ ప్లేట్లు చేంజ్ చేసిన, ట్యాంపరింగ్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పి రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడా సీఐ సిహెచ్ రమేష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, నేరడిగొండ ఎస్‌ఐ సయ్యద్ ఇమ్రాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






