28-11-2025 02:53:49 PM
న్యూఢిల్లీ: విమానంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వాములకు శుభవార్త. అయ్యప్ప స్వాములు(Ayyappa devotees) ఇరుముడితో విమానప్రయాణానికి అనుమతి లభించింది. విమాన ప్రయాణంలో ఇరుముడిని తమతోపాటు తీసుకెళ్లేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పవిత్ర ఇరుముడి కిట్టుని క్యాబిన్ బ్యాగేజ్‌గా అనుమతించాలని పలువురు అయ్యప్ప స్వాములు ఎక్స్ వేదికగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు.
చెక్-ఇన్‌లో వేస్తే చెప్పులు వేసుకున్న సిబ్బంది తాకడం భక్తులకు బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొన్ని సంవత్సరాలు క్యాబిన్‌లోకి అనుమతి ఉండేదన్న అయ్యప్పలు, తెలుగు రాష్ట్రాల నుంచి కొచ్చి, తిరువనంతపురం వెళ్లే అన్ని విమానాల్లో ఇరుముడిని క్యాబిన్‌లో తీసుకెళ్లేలా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఇరుముడిని చెక్ ఇన్ లగేజీగా పంపాలన్న నిబంధనలు ఉపసంహరణతో అయ్యప్పస్వాములు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి జనవరి 20 వరకు వర్తిస్తుందని పౌరవిమానయాన శాఖ సూచించింది. అయ్యప్పస్వామి భక్తుల విశ్వాసం మేరకు కేంద్రం నిబంధనలు మార్చింది.