వైద్యశాఖపై సర్కారు దృష్టి
- నిరంతరాయంగా నియామకాల ప్రక్రియ
- నేడు సీఎం చేతుల మీదుగా ఆర్డర్ కాపీలు..
- అందుకోనున్న 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 24 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నది. ప్రధానంగా వైద్య రంగంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఆ శాఖలో నియామకాల ప్రక్రియను నిరంతరం చేపడుతున్నది.
ఈక్రమంలోనే సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నూతనంగా నియమితులైన వైద్యులకు నియామక పత్రాలను అందించనున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 24 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులకు నియామాకపత్రాలను సీఎం అందించనున్నారు.
రాష్ట్రంలో ఏర్పాటైన 16 నర్సింగ్ కళాశాలను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటితో పాటు 32 ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లు, 28 ప్రభుత్వ పారామెడికల్ కాలేజీలను సైతం వర్చువల్‌గా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉస్మానియాలో ట్రాన్స్‌జెండర్లకు క్లినిక్ ఉండగా నేడు 32 జిల్లాల్లోనూ వీటిని ప్రారంభించనున్నారు.




