సాధారణ బదిలీలకు సర్కారు గ్రీన్ సిగ్నల్
- మే 1 నుంచి 31 వరకు షెడ్యూల్
- ఈ ప్రక్రియ ముగిసాక జూన్ 1 నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం
- ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగుల జేఏసీనేతలు జగదీశ్వర్, శ్రీనివాస్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిం ది. బదిలీలపై కొనసాగుతున్న నిషేధా న్ని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. మే 1 నుంచి 31 వర కు బదిలీలకు సం బంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి మూడేళ్లు ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
గతేడాది డిసెంబర్31 నాటికి ఒకేచోట నాలుగేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులను మాత్రం తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించింది. అయితే వచ్చే ఏడాది మే 31లోగా ఉద్యోగ విరమణ చేసేవారికి స్వచ్ఛందంగా కోరుకుంటే తప్ప బదిలీలు ఉండవని పేర్కొంది. ఒకే కేడర్‌లో 40 శాతానికి మించి ఉద్యోగులను బదిలీ చేయకూడదని సర్కారు నిర్ణయించింది.
వీరికి ప్రాధాన్యం...
బదిలీల్లో పలు కేటగిరీలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. భార్యాభర్తలు, వితంతువు, వచ్చే ఏడాది మే 31 పదవీ విరమణ పొందేవారు, 70శాతానికి మించి వైకల్యం ఉన్నవారు, మానసిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు ఉన్నవారు, క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్రీ, కాలేయమార్పిడి, ఓపెన్ హార్ట్ సజర్జరీ, ఎముకల టీబీ ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యతనిస్తూ మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రస్తుతం అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను, ప్రాధాన్య స్థానంలోకి బదిలీ చేయాలని ప్రభుత్వం వెల్లడించింది.
కఠినమైన ప్రాంతాల్లో సుదీర్ఘంగా పని చేస్తున్నవారికి కూడా ప్రాధాన్యతనివ్వనున్నారు. ఇక భార్యాభర్తల కేటగిరీలో మూడేళ్ల నిబంధన వర్తించదు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగుల ఆప్షన్లను స్వీకరించి బదిలీలు చేయనున్నారు. విద్యాశాఖ, పోలీస్, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, రవాణా, అటవీశాఖ విడివిడిగా ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేస్తాయి. బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమల్లోకి ఉంటుంది.
బదిలీల షెడ్యూల్ ఇలా... మే 1-7 వరకు ప్రణాళికలు, ఖాళీల జాబితా, మే 8-15 వరకు దరఖాస్తులు స్వీకరణ, మే 6-24 వరకు దరఖాస్తుల పరిశీలన, మే 25-31 వరకు బదిలీలకు ఉత్తర్వులు
హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగుల జేఏసీ నేతలు
ఎంతో కాలంగా ఎదురు చేస్తున్న ఉద్యోగుల బదిలీల జీవోను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస రావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎదురు చూస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఎంతో ఉపశమనం, సంతృప్తిని కలిగించిందన్నారు. ఈ జీవో విడుదలతో ఉద్యోగుల సంక్షేమం, పరిపాలనా సామర్థ్యం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ప్రతిబింబిస్తుందన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో తెలంగాణ ఉద్యోగు జేఏసీ సహకారం, మద్దతును అందిస్తుందని వారు పేర్కొన్నారు.






