28 March, 2026 | 3:54 PM

ప్రభుత్వ స్థల వివాదం – గుడి నిర్మాణానికి అడ్డంకులు, అధికారులకు వినతి

28-03-2026 02:01 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం గోవిందరావుపేట తండాలో ప్రభుత్వ స్థల వినియోగంపై వివాదం నెలకొంది. సుమారు 18 ఏళ్ల క్రితం ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన ఈ స్థలం ప్రస్తుతం గ్రామాభివృద్ధి పనులకు ఆటంకంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం ఈ స్థలంలో పంచాయతీ భవనం, మహిళా సంఘం భవనం, శుద్ధి చేసిన తాగునీటి ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా పంచాయతీ భవనం, మహిళా సంఘం భవనాల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమై కొనసాగుతున్నాయి.అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనంతరం ఈ ప్రదేశంలో అధికారికంగా ‘భాగ్ బండార్’ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.ఇదే నేపథ్యంలో తండా వాసులంతా కలిసి అక్కడ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మించాలని నిర్ణయించారు.

కానీ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ గుడి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని తండా వాసులు ఆరోపిస్తున్నారు.తండాలో మొత్తం 120 కుటుంబాలు ఉండగా, కేవలం 20 కుటుంబాలకు చెందినవారే ఈ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నారని వారు పేర్కొన్నారు.గత పాలకుల కాలం నుండి కొనసాగుతున్న ఈ వివాదంపై ఉన్నతాధికారులు స్పందించి,తండా వాసుల మనోభావాలకు అనుగుణంగా గుడి నిర్మాణానికి సహకరించాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు డిప్యూటీ తహశీల్దార్ ప్రవీణ్‌కు వినతి పత్రం సమర్పించారు.