ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు
రియల్ ఎస్టేట్ కబ్జాలను అడ్డుకోవాలి
ఎమ్మెల్యే, ఏంపీలు ప్రభుత్వ భూములపై దృష్టి సారించాలి
పేదలకు ప్రభుత్వ భూములను కేటాయించాలి
ప్రెస్ మీట్ లో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ డిమాండ్
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): ప్రభుత్వ భూములు కబ్జాలు అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాదసి రవీందర్ ప్రశ్నించారు. మంగళవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షేట్టిపేట మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములతో పాటు చెరువులు, కుంటలు,ఇరిగేషన్ కాలువలు కూడా కబ్జాకు గురవుతున్నాయన్నారు. పట్టణంలోని మోదెల శివారులోని సర్వే నెంబర్ 59/అలోని ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారని ఆరోపించారు.
అదే విధంగా బోట్లకుంట, మంగలి కుంట, చాకలి కుంట చెరువులు కబ్జాలకు గురవుతున్నాయని వివరించారు. బోట్లకుంటలోని ఇందిరమ్మ గద్దె ప్రాంతంలోని కెనాల్, ఆ పరిసర ప్రాంత ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్టు వెల్లడించారు.మున్సిపాలిటీ, మండలంలోని పలు చెరువులకు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ హద్దులను నిర్ధారించాలన్నారు. ఈ కబ్జాలపై రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు చూసిచూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలపాలని ప్రశ్నించారు.మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎంపీ వంశీ కృష్ణ లు ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్థలం ఉంటేనే ప్రజల కోసం పలు కార్యాలయాలను నిర్మించవచ్చన్నారు.
అనంతరం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయని,ఇప్పటికే మందమర్రి మండలంలో ఇదే విధంగా కబ్జాలు జరిగితే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి పలు ప్రభుత్వ భూములను కాపాడినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ప్రభుత్వ నిషేదిత భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు లే అవుట్ పేర్ల తో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారన్నారు. ప్రభుత్వ నిషేధిత జాబితాలోని భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆయా శాఖల అధికారులకే తెలియాలన్నారు. నాలా కన్వర్షన్ లేకుండా రిజిస్ట్రేషన్ లు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు గండి కొడుతున్నారని తెలిపారు.
మున్సిపాలిటీతో పలు గ్రామాల్లో వెంచర్లు వేసి చుట్టూ పక్కల ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేస్తున్నట్లు తెలిపారు. సరైన అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను విక్రయిస్తున్న కూడా అధికారులు మామూలుగా తీసుకుంటున్న నేపథ్యంలో త్వరలో బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళనలు కూడా చేపడతామని హెచ్చరించారు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై తమ వైఖరి మార్చుకోవాలన్నారు. ఇప్పటికైన ప్రభుత్వ భూములను కాపాడి వాటికి హద్దులను నిర్ణయించి, ఆ స్థలాల్లో బోర్డు లను ఏర్పాటు చేయాలన్నారు.






