10 August, 2026 | 3:45 AM

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం

10-08-2026 01:00 AM
  1. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిపివేతతో ఇబ్బందులు
  2. సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల ఇక్కట్లు 
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతోందని మాజీ మంత్రి  హరీశ్‌రావు ఆరోపించారు. డిగ్రీలు, ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసినప్పటికీ కళాశాల ల నుంచి సర్టిఫికెట్లు పొందలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.  సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ అవార్డులు ఆదివారం అందజేసి మాట్లాడారు.

10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దళిత విద్యార్థులకు అవార్డులు అందజేసి అభినందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్ వంటి మహనీయులు సాధించిన రిజర్వేషన్ల ఫలితంగానే అనేక మంది విద్యావంతులై ఉన్నత స్థానాలకు చేరుకున్నారని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించి ఫీజు చెల్లించలేని దళిత విద్యార్థులు తన దృష్టికి వస్తే వారిని డాక్టర్లుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానన్నారు. న్యూస్ సొసైటీకి తనవంతు సహాయంగా రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు.   ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ నిధుల విషయంలోనూ ప్రభుత్వం తగినంతగా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు.