8 July, 2026 | 2:02 AM

సర్కారు బడులున్నా.. విద్యార్థులు సున్నా!

08-07-2026 12:00 AM

విద్యార్థులు లేక వెలవెలబోతున్న గదులు

నాగలిగిద్ద మండలంలో తగ్గుతున్న చేరికలు

మూతపడే దిశగా ప్రైమరీ స్కూల్స్ 

నాగలిగిద్ద, జూలై 7: ఒకప్పుడు విద్యార్థుల సందడితో కళకళలాడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నేడు విద్యార్థుల కొరతతో వెలవెలబోతున్నాయి. నాగలిగిద్ద మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో విద్యాశాఖ లక్ష్యాలు నెరవేరడం లేదు.

మండలంలో మొత్తం 54 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో 45 ప్రాథమిక పాఠ శాలలు, 6 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, 3 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం 125 మంది ఉపాధ్యాయులు, 1,7 90 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 599 మంది కొత్త విద్యార్థులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఇప్పటివరకు 297 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. మొత్తం విద్యార్థుల సంఖ్యను 2,599కు చేర్చాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

మండలంలోని 18 ప్రభుత్వ పాఠశాలల్లో 15 మందిలోపు విద్యార్థులు మాత్రమే ఉండడం ఆందోళన కలి గిస్తోంది. ముఖ్యంగా గౌడ్గాం జన్వాడ, సికర్ఖాన పలు గ్రామాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో ఆ పాఠశాలల భవిష్య త్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపడం, విద్యార్థుల సంఖ్య తగ్గడం, గ్రా మాల నుంచి వలసలు వంటి కారణాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

మరోవైపు కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఉపాధ్యాయుల వినియోగం కూడా సమర్థవంతంగా ఉండడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కరస్గుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల కొరత కారణంగా పదో తరగతి విద్యార్థులకు పూర్తి స్థాయిలో బోధన అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఖాళీలను భర్తీ చేసి విద్యార్థుల విద్యకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు, నాణ్యమైన బోధన, అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రత్యేక ప్రవేశాల కార్యక్రమాలు నిర్వహిస్తేనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నాం..

నాగలిగిద్ద మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని పాఠశాలల్లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

ఎంఈవో మన్మధ కిషోర్