సింగపూర్ టీచర్స్ ఎక్స్‌ఫోజర్ విజిట్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు
విదేశీ పర్యటనకు ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం
మంచిర్యాల, ఆగస్టు 26 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల విద్యా పర్యటన (టీచర్స్ ఎక్స్ ఫోజర్ విజిట్, ఎడ్యుకేషన్ ఎక్సెంజ్ ప్రోగ్రాం)లో భాగంగా సింగపూర్ పర్యటనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అవకాశం కల్పించారు.
రాష్ట్రంలో విద్యాప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను, హెచ్‌ఎంలను, ఎంఈఓలకు అంతర్జా తీయ స్థాయిలో విద్యాబోధన పద్దతులపై అవగాహన కల్పించేందుకు విద్యా పర్యటనకు రాష్ట్రంలో మొదటి బ్యాచ్ లో 40 మంది ఉ పాధ్యాయులకు అవకాశం కల్పించగా, రెం డవ బ్యాచ్ కు 29 మందికి అవకాశం కల్పించింది. మొదటి బ్యాచ్ సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు, రెండవ బ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు సింగాపూర్ లో పర్యటించనున్నారు.
విదేశీ పర్యటనకు ఉమ్మడి జిల్లా నుంచి పలువురికి అవకాశం...
సింగపూర్ రెండవ బ్యాచ్కు రాష్ట్ర వ్యా ప్తంగా 29 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా అందులో మంచిర్యాల జిల్లా హాజీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలు రాచకొండ కళ్యాణితో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జడ్పీహెచ్‌ఎస్ (బాలుర) జీహెచ్‌ఎం రాథోడ్ సుభాష్, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం దన్సూర్(బీ) జడ్పీఎస్‌ఎస్ జీహెచ్‌ఎం చొప్డె రాజులు ఎంపికయ్యారు.
మొదటి బ్యాచ్ లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం జన్కాపూ ర్ జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ అసిస్టెంట్ వడ్లూరి రాజేష్, రెబ్బన మండలం రెబ్బెన ఎంపీపీఎస్ ఎస్జీటీ అడ్లూరి లావణ్య, కాగజ్ నగర్ మండలం జడ్పీ హై స్కూల్ ఎస్‌ఏ హదియాబేగంలతో పాటు నిర్మల్ జిల్లా భైంసా మం డలం వానల్ పాడ్ ఎంపీపీఎస్‌ఎస్జీటీ మాదరి ఎల్లన్నలుఎంపికయ్యా రు. రెండు విడతల్లో ఉమ్మడి జిల్లా నుంచి ఏడుగురికి అవకాశం లభించినట్లైంది.
పర్యటనలో పరిశీలించే అంశాలివే
సింగపూర్లో పాఠశాలలను సందర్శించి, అక్కడి విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల అభ్యసన ప్రక్రియలను అధికారుల పర్యవేక్షణలో ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ తరగతులు, అత్యాధునిక టెక్నాలజీని ఉపగియోగించి బోధన చేయడం, సైన్స్, గణితం, లాంగ్వేజ్ లలో అమలు చేస్తున్న ఆదునిక, ప్రయోగాత్మక బోధన పద్దతులు, పాఠశాలల నిర్వాహణ, హెచ్‌ఎంల నాయకత్వ లక్షణాలు తదితరాలను సమగ్రంగా పరిశీలించనున్నారు.
సింగాపూర్ పాఠశాలల్లో అమలు చేస్తు న్న పాఠ్యాంశాలు, మూల్యాంకన విధానం, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం, తరగతి గదిలో అభ్యసన వాతావరణం, అమలవుతున్న ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి, వాటిలో మన రాష్ట్రానికి, ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలకు అనుకూలమైన విధానాలను గుర్తించి, వాటిని పాఠశాలల్లో అమలు చేయడానికి కృషి చేయనున్నారు.






