5 June, 2026 | 2:32 AM

ప్రజల కోసమే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు

05-06-2026 01:15 AM

అదనపు కలెక్టర్ చంద్రయ్య

చెన్నూర్, జూన్ 4: ప్రజల కోసమే ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి చంద్రయ్య అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక సభలలో భాగంగా గురువారం చెన్నూర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన వార్డు సభ, మండలంలోని అక్కపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్, మండల పంచాయతీ అధికారి అజ్మత్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బానోతు ప్రసాద్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణపై గ్రామస్తులు అవగాహన కలిగి ఉండాలని, ఇంటి వద్దనే వ్యర్థాలను పొడి, తడి, శానిటరీ, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలుగా వేరు చేయడం ద్వారా పరిశుభ్రమైన గ్రామ వాతావరణాన్ని నెలకొల్పవచ్చని వివరించారు.

వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, పునర్వినియోగం, కంపోస్టింగ్ విధానాలపై సూచనలు చేశారు. స్వచ్ఛ గ్రామ్  సురక్షిత జలవాయు కార్యక్రమం లక్ష్యాలు, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు కోసం గ్రామస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై వివరించారు.   అనంతరం చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 6, 8 వార్డుల ప్రత్యేక వార్డు సభలలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, చైర్పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్పర్సన్ నాయకపు వినయ్, సి.ఐ., వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు.  యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రగ్స్కు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఏఈఓలు, పోలీసు శాఖ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పం చాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.