6 August, 2026 | 1:39 AM

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలి

06-08-2026 12:55 AM

మంత్రి వివేక్ వెంకట స్వామి

చెన్నూర్, ఆగస్టు 5: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికి అందే విధంగా అధికార యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. బుధవారం జిల్లాలోని చెన్నూర్ మండల కేంద్రంలోని ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయంలో చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ లతో కలిసి కోటపల్లి, చెన్నూర్, భీమారం, జైపూర్ మండలాల తహసిల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మంత్రి మాట్లాడారు.

జిల్లాలో వివిధ రకాల నిధులతో చేపడుతున్న అభివృ ద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నగర అభివృద్ధి నిధులతో మున్సిపల్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సి.సి. రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ, నీటి ట్యాంకులు, విద్యుత్ స్తంభాలు తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.

మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, గృహ నిర్మాణ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. వచ్చే సంవత్సరం జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి పుష్కర ఘాట్ల ఏర్పాటు, అంతర్గత రహదారుల నిర్మాణం, ప్రజా సౌకర్యాల కల్పన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.