21-11-2025 01:28:41 PM
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్‌లో(Prasad IMAX) తెలంగాణ–నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) శుక్రవారం ప్రారంభించారు. జాతీయ అవార్డు గ్రహీత ఫాదర్ జోసెఫ్ దర్శకత్వం వహించిన త్రిపుర చిత్రం యార్వింగ్ ప్రారంభ ప్రదర్శనకు హాజరయ్యారు. తెలంగాణ–నార్త్ ఈస్ట్ కనెక్ట్ లో భాగంగా రెండు రోజుల పాటు ఫిల్మ్ ఫెస్టివల్(Film Festival) కొనసాగనుంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... ఈశాన్య రాష్ట్రాలు చాలా వైవిధ్యతతో కూడకున్నవని తెలిపారు. మణిపూర్, అసోంలో మంచి ఫిల్మ్ మేకర్స్ ఉన్నారని వెల్లడించారు. దేశం గర్వించదగ్గ ఫిల్మ్ ఇండస్ట్రీ తెలంగాణలో ఉందని గవర్నర్ స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఎదుగుతోందని జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు.
ఈశాన్యా రాష్ట్రాలు ఈ దేశంలోనే ప్రత్యకమైనవని గవర్నర్ అభివర్ణించారు. ఈశాన్య ప్రాంతాలలో తెలుగు సినిమా విశేషమైన ప్రజాదరణ పొందిందని, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మారుమూల గిరిజన వర్గాలలో కూడా దీనిని విస్తృతంగా చూస్తున్నారని చెప్పారు. ప్రారంభ సమావేశం తర్వాత, గవర్నర్ అధికారికంగా ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైనట్లు ప్రకటించారు. యార్వింగ్ ప్రదర్శన కోసం ప్రేక్షకులతో చేరారు. హైదరాబాద్‌లో చిత్రాన్ని ప్రదర్శించే అవకాశం లభించినందుకు దర్శకుడు జోసెఫ్ కృతజ్ఞతలు తెలిపారు. యార్వింగ్ కోసం నగరంలో ముఖ్యమైన పోస్ట్-ప్రొడక్షన్ పనులు చేపట్టారని గుర్తు చేసుకున్నారు. తారా (సిక్కిం నేపాలీ), కుకీ (హిందీ), ఒనాత (ఖాసీ, మేఘాలయ), ఐఖోయిగి యం (మణిపూర్), రెడ్ లేదా పాఖీ (అస్సాం)తో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్మించిన ప్రశంసలు పొందిన తెలుగు చిత్రాలతో సహా ప్రముఖ చిత్రాల ప్రదర్శనలతో ఈ ఉత్సవం కొనసాగుతుంది. అవార్డ్ విన్నింగ్ తెలుగు సినిమాలు నా బంగారు తల్లి, పొట్టెల్, మల్లేశం కూడా ప్రదర్శించబడతాయి. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, క్రీడలు, యువజన సర్వీసుల మంత్రి వాకాటి శ్రీహరి, ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, టీజీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.