21-11-2025 11:40:15 AM
ఉస్మాన్ నగర్‌లో స్వల్ప ఉద్రిక్తత
కూల్చివేతలపై రాస్తారోకో,
మున్సిపల్ కమిషనర్‌పై తీవ్ర విమర్శలు
రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మునిసిపాలిటీ(Tellapur Municipality) పరిధిలోని ఉస్మాన్ నగర్ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. లంచాలు తీసుకుంటూ బిల్డర్లకు సహకరిస్తూ, పేదవారి ఇళ్ల నిర్మాణాలను అన్యాయంగా కూల్చివేస్తున్నారనే ఆరోపణలతో తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్‌పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలు కోర్టు స్టే ఆర్డర్‌ను ఉల్లంఘించి నిర్వహించారని బాధితులు ఆరోపించారు. స్టే ఉన్నప్పటికీ అధికారులే నిర్లక్ష్యంగా చర్యలు తీసుకోవడం తీవ్ర అన్యాయమని వారు పేర్కొన్నారు.
కూల్చివేతల ప్రాంతంలోనే రోడ్డు మీద రాడ్లు, ఇనుప వస్తువులు వేసి రాస్తారోకోకు దిగిన నిరసనకారులు ఏకపక్ష నిర్ణయాలతో పేదవారిపై దాడి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కమిషనర్ స్వయంగా అక్కడికి రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా "కమిషనర్ డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపి పరిస్థితిని శాంతింపజేశారు. అనంతరం తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కూడా బాధితులు బైఠాయించి నిరసనను కొనసాగించారు.