21-11-2025 12:28:56 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పుట్టిన ప్రాంతంగా అచ్చంపేట పేరుంది. అచ్చంపేట మండలం(Achampet mandal) పల్కపల్లి గ్రామంలో గంజాయి పెరటి సాగు కలకలం రేపింది. గ్రామానికి చెందిన నాగనులు మధు అనే యువకుడు గంజాయి మత్తుకు అలవాటు పడి మార్కెట్‌లో అధిక ధరలకు గంజాయి కొనలేక, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో గంజాయి విత్తనాలను కొనుగోలు చేసి తన సొంత ఇంటి పెరట్లోనే మొక్కలు పెంచుకున్నాడు. తాను వినియోగించడంతోపాటు ఇతరులకు కూడా గంజాయి విక్రయించేవాడు ఈ తంతు గత రెండేళ్లుగా జరుగుతున్నప్పటికీ ఎక్సైజ్ పోలీస్ శాఖలు గుర్తించలేకపోయాయి. గురువారం రాత్రి కచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి తనిఖీ చేయగా నాగనూలు మధు అనే యువకుడు తన పెరటిలో సుమారు 18 గంజాయి మొక్కలను గుర్తించారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) సైతం నిర్లక్ష్యం వహిస్తూ మొద్దు నిద్రలో ఉన్న ఎక్సైజ్ శాఖను పట్టించుకోకపోవడంతో నాగర్ కర్నూల్ జిల్లాలో గంజాయి, ఆల్ఫాజూలం విక్రయాలు బాహాటంగా జరుగుతున్నాయని సామాన్యులు బాహాటంగా విమర్శిస్తున్నారు. నిత్యం కళ్ళు దుకాణాలు, మద్యం దుకాణాలు, బెల్టు దుకాణాల నుంచి వచ్చే ముడుపులను లెక్కబెట్టుకోవడంలోనే బిజీగా ఉన్నారని సామాన్యులు మండిపడుతున్నారు. సుమారు రెండేళ్లుగా పెరటి మొక్కల మాదిరి గంజాయి సాగు చేస్తున్నా ఎక్సైజ్ శాఖ తెలియకపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితమైన సమాచారంతో అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్, మరో ఎస్ఐ సుధీర్ కుమార్, పోలీస్ కానిస్టేబుల్ లో మహేష్ మల్లేష్ వెంకట్ నాయక్ పంచాయతీ సెక్రెటరీ బాలరాజు రెవెన్యూ సిబ్బంది బృందం దాడులు చేయగా ఐదు కిలోల బరువు గల 18 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సద్దాం హుస్సేన్ తెలిపారు.