21-11-2025 01:05:20 PM
హైదరాబాద్: నగరంలో భారీగా భూకుంభకోణం జరుగుతోందని మాజీమంత్రి కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ఆరోపించారు. బాలానగర్, నాచారం, జీడిమెట్లలో భూ కంభకోణం జరుగుతోందన్నారు. నగరంలో ఉన్న 9,500 ఎకరాల పారిశ్రామిక వాడల భూములను, రేవంత్ రెడ్డి తన బంధువులు, స్నేహితులకు కట్టబెడుతున్నాడని కేటీఆర్ స్పష్టం చేశారు. రూ. 5 లక్షల కోట్ల విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కేబినెట్ భేటీలో తెరలేపిందని తెలిపారు. హైదరాబాద్‌లో భూములు ఉన్న చోట రేవంత్ రెడ్డి ముఠా వాలిపోతుందని, రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆలోచనలు మొత్తం భూములపైనే ఉంటుందన్నారు.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ పేరిట 9,295 ఎకరాల పారిశ్రామిక భూములను, రేవంత్ రెడ్డి ఏటీఎంగా మార్చుకునే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రియల్ భూములు రెగ్యులరైజ్ చేయడానికి 100శాతం, 200 శాతం ఫీజు చెల్లించాలని నిబంధన పెట్టామని కేటీఆర్ తెలిపారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి, ఏవీ.రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి లాంటి బడా బాబులకు కేవలం 30శాతం ఫీజు చెల్లిస్తేనే రెగ్యులరైజ్ చేస్తామని కేబినెట్ సమావేశంలో మంత్రులు ఆమోదం తెలిపారని ఆరోపించారు. 9,295 ఎకరాల సర్కార్ భూములను తక్కువ ధరకు రెగ్యులరైజ్ చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 30శాతం ప్రభుత్వానికి వస్తే, మిగతా 60శాతం రేవంత్ రెడ్డి దోచుకునే ప్రయత్నంలో ఉన్నాడని కేటీఆర్ వివరించారు. రేవంత్ రెడ్డి ఈ భూముల ద్వారా దాదాపు రూ.4 లక్షల కోట్ల నుండి రూ.5 లక్షల కోట్ల రూపాయల స్కామ్ చేస్తున్నాడని కేటీఆర్ వెల్లడించారు.