4 April, 2026 | 9:21 PM

Breaking News

ఫీజు రీయింబర్స్మెంట్ పై హై కోర్టు వ్యాఖ్యలు బాధాకరం

04-04-2026 07:58 PM

విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి

విలేకర్ల సమావేశంలో జార్జి రెడ్డి పిడిఎస్యు రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ ఎస్ నాగేశ్వర రావు

ఖమ్మం: ఫీజు రీయింబర్స్మెంట్ పై హై కోర్టు వ్యాఖ్యలు బాధాకరమని,తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయడంలో ప్రభుత్వాలు తీవ్ర జాప్యం చేస్తున్నాయని జార్జి రెడ్డి పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ ఎస్ నాగేశ్వర రావు   ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జార్జి రెడ్డి పి డి ఎస్ యు తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ ఎస్ నాగేశ్వర రావు మాట్లాడుతూ... విద్యార్థుల విద్యా భవిష్యత్ పై నీలి నీడలు కమ్ముకున్నాయని, విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల్లో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు అనేక రోజులుగా ఉద్యమాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. 

ప్రభుత్వాలు ఫీజు బకాయిలు విడుదల చేస్తామని గడువులు పెడుతూ కాలం గడుపుతున్నాయి, కానీ నిధులు మాత్రం రిలీజ్ చేయడం లేదని ఆవేదన వెల్లుబుచ్చారు. సహజంగా ప్రభుత్వాలు తమ బాధ్యత విస్మరించిన సందర్భంలో కోర్టులు ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యహరించేలాగా ఆదేశాలు ఇస్తుంటాయని కానీ ఇక్కడ మాత్రం విద్యార్థులపై భారం కలిగించేలా తాజా ఆదేశాలు ఉన్నాయని, తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన (ఏప్రిల్ 03) తాజా తీర్పు విద్యార్థులలో గందరగోళం కలిగించింది.

 ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తానని వాగ్దానం చేసిన ఫీజు రీయింబర్స్ ప్రభుత్వం ఇవ్వకపోతే ముందస్తుగా విద్యార్థుల నుండి  ఫీజులు వసూలు చేసుకోవడానికి ప్రవైట్ కలశాల యాజమాన్యాలకు అనుమతి ఇవ్వడం అంటే పేద విద్యార్థుల విద్యపై భారం మోపడమే అవుతుందని విమర్శించారు. గౌరవ కోర్టు ఈ తీర్పు ను సమీక్షించి, ప్రభుత్వం హామీ ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వవలసిన కోరారు. రాష్ట్రంలో సుమారు 10 వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు పెండింగ్ లో ఉన్నాయి.

దఫా దఫాలుగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంతవరకు ఆ హామీని అమలు చేయడం లేదని, దీని వలన లక్షలాది విద్యార్ధుల విద్యా భవిష్యత్ గందరగోళంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధికి కీలకమైన మానవ వనరులు మీద, విద్యా రంగం మీద ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యహరించేలగా, రాజ్యాంగం విద్యార్థులకి  కల్పించిన హక్కులు పరిరక్షించేలా,  ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పాలన చేసే విధంగా గౌరవ న్యాయస్థానాలు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్,స్కాలర్షిప్ నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జార్జిరెడ్డి పీడీఎస్యు రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ కె.స్వాతి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు మందా సురేష్,జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి రాము, జిల్లా గర్ల్స్ కన్వీనర్ పైండ్ల శ్యామల తదితరులు పాల్గొన్నారు.