3 June, 2026 | 1:19 AM

జిల్లాలో 85 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి

03-06-2026 12:30 AM

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్, జూన్ 2 (విజయక్రాంతి): రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ప్రతిరోజూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, ధాన్యం కొనుగోళ్లు, రవాణా, మిల్లులకు తరలింపు, సమస్యలపై ఆరా తీస్తున్నారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నారు. మరోవైపు జిల్లాలోని వివిధ మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శిస్తూ, రైతులతో మాట్లాడుతున్నారు.

కాంటా ప్రక్రియ, తేమ శాతం పరీక్షలు, రికార్డుల నిర్వహణ, ధాన్యం నిల్వలు, రవాణా ఏర్పాట్లను పరిశీలిస్తూ, కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 68,518 రైతుల వద్ద నుంచి 3,31,982.080 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, 53,086 మంది రైతుల ఖాతాల్లోకి రూ. 571.48 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. ధాన్యం రవాణా, నిల్వ, లోడింగ్, అన్లోడింగ్, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఎటువంటి ఆలస్యం లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

జిల్లాలో ప్రస్తుతం 600 లారీలు, 50 డీసీఎంలు, 300 ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. గోదాములు, రైస్ మిల్లుల వద్ద నిలిచిపోయిన లారీలను వెంటనే అన్లోడ్ చేసి, తిరిగి కొనుగోలు కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల పనితీ రు పట్ల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, నిరంతరం పర్యవేక్షించాలనీ మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.