ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టాలి
- రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలి..
- తాగునీటి సమస్య రావద్దు..
- ముందస్తు చర్యలు తీసుకోవాలి..
- గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యం..
- రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సైదాపూర్, ఏప్రిల్28(విజయక్రాంతి): గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టాలనీ, రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అధికారులు ఆదేశించారు. మంగళవారం వరిధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వివిధ అంశాలపై కరీంనగర్ జిల్లా సైదాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా, మండల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు జిల్లా మండల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్ తో పాటు అధికారులకు కీలక సూచనలు చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని ఇందుకు అవసరమైన వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే పేమెంట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలన్నారు. మొదటి విడత లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన ఇండ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పూర్తయిన ఇండ్లను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి మంజూరైన వివిధ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.






