ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి, మే 1 (విజయక్రాంతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లాలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అడిషనల్ కలెక్టర్ మాధురితో కలిసి ఆయన ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం, ట్యాబ్ ఎంట్రీలు, కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, గన్ని బ్యాగుల లభ్యత, తేమ కొలిచే యంత్రాలు, రైతుల ఖాతాల్లో జమ అయిన చెల్లింపుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు కీలక సూచనలు జారీ చేశారు. ప్యాక్స్, డీసీఎంఎస్, ఐకేపీల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 175 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.






