calender_icon.png 13 November, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

13-11-2025 12:00:00 AM

రైతులను ఇబ్బందులు పెట్టొద్దు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ, నవంబర్ 12( విజయక్రాంతి): అధికారులు, రైస్ మిల్లర్లు రాత్రి, పగలు పనిచేసి ధాన్యం కొనుగోలును సవ్యంగా పూర్తిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ధాన్యం, పత్తి సేకరణ, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.

అకాల వర్షాలు, తుఫాన్ వల్ల ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నారు.ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున అవసరమైతే రాత్రి, పగలు ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.వచ్చే నెల రోజుల పాటు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు.

ధాన్యం సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పూర్తిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని, మిల్లర్లు  రైతులను ఏలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ధాన్యం అన్‌లోడ్ చేసుకోవాలని, ఈ విషయంలో రైతులకు పూర్తి సహకారం అందించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. తేమ, తరుగు, తాలు వంటి విషయాలతో రైతులను సతాయించవద్దని ఆయన కోరారు.

ఎండలు బాగా వస్తున్నందున రైతులు పగటిపూట ధాన్యాన్ని అరబెట్టుకోవాలని ,సరైన తేమ వచ్చిన వెంటనే అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లను,ప్యాడి క్లీనర్లు,తేమ యంత్రాలను ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు టపాలిన్లను తెప్పించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు,మిల్లుల్లో నైట్ షిఫ్ట్లు ఏర్పాటు చేసి హమాలీలు పనిచేసేలా చూడాలని ,రాష్ట్రంలోనే నల్గగొండ జిల్లా ధాన్యం  సేకరణలో రెండవ స్థానం పొందినని, దీన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోలును సవ్యంగా చేయాల్సిందిగా కోరారు.

రైస్ మిల్లర్లు నారాయణ, భద్రం, ఇంద్రసేనారెడ్డిలు మాట్లాడుతూ బాయిల్ రైస్ కోట జిల్లాకు ఎక్కువగా ఇప్పించాలని, బకాయి ఉన్న మిల్లింగ్ చార్జీలు, ట్రాన్స్‌పోర్ట్ బకాయిలను వెంటనే ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ విషయంపై మంత్రి స్పందిస్తూ జిల్లాకు బాయిల్ రైస్ కోటా ఎక్కువగా ఇచ్చే విషయం ముఖ్యమంత్రితో మాట్లాడుతామని,పత్తి కొనుగోలు విషయమై ఢిల్లీలోని అధికారులతో ఇదివరకే మాట్లాడినట్లు తెలిపారు.

బకాయిల విషయంలో ఎఫ్‌సీఐ అధికారులతో మాట్లాడి ఇప్పించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, పౌరసరఫరాల జిల్లా అధికారి వెంకటేశ్, జిల్లా మేనేజర్ గోపికృష్ణ, డీఆర్డీవో శేఖర్ రెడ్డి, డీసీఓ పత్యా నాయక్, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, తదితరులు పాల్గొన్నారు.