23-05-2025 01:29:24 AM
జయశంకర్ భూపాలపల్లి, (మహబూబాబాద్) మే 22 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం కురిసిన భారీ వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం పూర్తిగా వర్షానికి తడిసిపోయింది. నగరంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగరేణి సంస్థకు చెందిన ఖాళీ ప్రదేశం లో ఏర్పాటు చేయగా అందులో రైతులు ధాన్యాన్ని తెచ్చి విక్రయానికి ఉంచారు.
ఈ క్రమంలో భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి భారీగా వరద చేరడంతో చెరువుగా మారింది. రైతుల ధాన్యం పూర్తిగా తడిసిపోయి ఎందుకు పనికిరాని పరిస్థితి ఏర్పడిందని రైతు ఎల్లయ్య కన్నీరు మున్నీరయ్యారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనేక కొర్రీలు పెడుతూ ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయకుండా దాటవేత ధోరణి అవలంబించడం వల్ల తమకు తీవ్ర నష్టం కలిగించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్పందించి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.