23-05-2025 11:44:46 AM
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్(BRS Working President KTR) ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయని వివరించారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరును ఈడీ చేర్చిందని కేటీఆర్ వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం(NDA government) ఈసారైనా రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. అమృత్ వంటి స్కామ్ ల తరహాలో వదిలిపెడతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald case)లో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) పేర్కొన్నారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైందన్నారు. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయిందని కేటీఆర్ వెల్లడించారు. వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరిందని విమర్శించారు.
దివ్యమైన తెలంగాణని దివాళా తీసి వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి(Revanth Reddy) అడ్డంగా ఇరుక్కుపోయారని కేటీఆర్ చెప్పారు. ఈడీ, కేవలం చార్జిషీటులో పేరు పెట్టడం వరకే పరిమితం అవుతుందా ? లేక రేవంత్ రెడ్డిని విచారణను పిలిచి మొత్తం అవినీతి కుంభకోణాలను కక్కిస్తుందా ? అన్నారు. కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఫైలు కదలడం లేదని స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ(Cabinet Minister Konda Surekha) కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వరుసగా వెలుగుచూస్తున్నాయని ఆయన వెల్లడించారు. 30 శాతం పర్సెంటేజీలు ఇవ్వనిదే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆ పార్టీ బట్టలిప్పడంతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్నారు. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టడమే కాకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేస్తూ, పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాపం పండింది. చివరికి ధర్మం గెలుస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.